పాలిసెట్‌కు నేడు తుది గడువు
రాయవరం: పదో తరగతి విద్యార్హతతో సాంకేతిక విద్యకు పునాది వేసే ‘పాలిసెట్’ దరఖాస్తుకు గురువారం సాయంత్రంతో గడువు ముగియనుంది. ఫిబ్రవరి 27న నోటిఫికేషన్ విడుదలైన విషయం పాఠకులకు విదితమే. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు లభిస్తాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు తుది గడువు గురువారంతో ముగుస్తున్న నేపథ్యంలో దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు త్వరపడాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 4,236 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
తప్పుడు రాజకీయాలు చేయొద్దు
టీడీపీ నాయకులపై ఎమ్మెల్యే గిడ్డి ఫైర్
పి.గన్నవరం: కూటమి నిబంధనలకు కట్టుబడి తాను పనిచేస్తుంటే, కొందరు టీడీపీ నేతలు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఫైర్ అయ్యారు. తనను సంప్రదించకుండా అంబాజీపేట మార్కెట్ చైర్మన్ పదవి కోసం టీడీపీ నేతలు నాలుగు పేర్లు ఎంపిక చేసి అధిష్టానానికి పంపిన తర్వాత తన అవసరమేముందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబాజీపేటలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపికపై బుధవారం టీడీపీ నాయకులు సమావేశమై గణపతి వీరరాఘవులు పేరును ఎంపిక చేశారు. అక్కడినుంచి వారంతా పి.గన్నవరం వచ్చి టీడీపీ కన్వీనర్ నామన రాంబాబుకు తమ నిర్ణయాన్ని వివరించి అనంతరం ఎమ్మెల్యే వద్దకు వచ్చి రాఘవులుకు అవకాశం కల్పించాలని కోరారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీకు మీరే కొన్ని పేర్లను అధిష్టానానికి పంపుకొన్నాక తన అవసరమేంటని, ఇది రాజకీయ ద్రోహం కాదా అని అన్నారు. చివరికి టీడీపీ నాయకుల వినతిపత్రాన్ని స్వీకరించి రాఘవులు నియామకానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం టీడీపీ నాయకులు వెళ్లిపోయాక వారి వెంట వచ్చిన జనసేన కార్యకర్తలపై మండిపడుతూ వారు తనను అవమానిస్తుంటే మీరెలా మద్దతుగా వచ్చారని ప్రశ్నించినట్టు సమాచారం.
అన్నవరం భక్తుల
నుంచి అభిప్రాయ సేకరణ
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భక్తులకు అందిస్తున్న సేవలపై ఎందుకు భక్తుల్లో అసంతృప్తి నెలకొని ఉందనే దానిపై ఇద్దరు ప్రయివేట్ వ్యక్తులతో కూడిన ఐవీఆర్‌ఎస్ బృందం రెండో రోజు బుధవారం కూడా అభిప్రాయ సేకరణ నిర్వహించింది. ప్రధానంగా అన్నదానం పథకంలో ఆహార పదార్థాలు రుచిగా ఉన్నాయా అని భక్తులను ఆ బృందం ప్రశ్నించింది. బాగున్నాయని చాలామంది భక్తులు చెప్పినట్టు సమాచారం. అయితే ఒకరిద్దరు మంచినీరు ఆలస్యమవుతోందని తెలిపారు. సత్యదేవుని నిత్యాన్నదానం హాలు ఫ్లోరింగ్ శుభ్రతపై ఆ బృందం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఫ్లోరింగ్ శుభ్రత ఇంకా బాగుండాలని, చెప్పినట్టు తెలిసింది. దేవస్థానం టాయిలెట్స్‌లో పరిశుభ్రత పై కూడా ఆ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసిందని సమాచారం.
వక్ఫ్ చట్ట సవరణలపై నిరసన
కాకినాడ సిటీ: ముస్లిం మైనారిటీల హక్కులను హరిస్తున్న వక్ఫ్ సవరణలకు వ్యతిరేకంగా కాకినాడలో బుధవారం ముస్లింలు కదం తొక్కారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని వక్ఫ్ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు–2025ను వ్యతిరేకిస్తూ ముస్లిం వక్ఫ్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. మొయిన్‌రోడ్డులోని జమియా మసీద్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. వక్ఫ్‌ను కాపాడండి, రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ షణ్మోహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ముస్లిం నాయకులు జవహర్ అలీ, తాజువుద్దీన్, అబ్దుల్ బషీరుద్దీన్, రెహమాన్ పాల్గొన్నారు.
పాలిసెట్‌కు నేడు తుది గడువు


