
ఉపాధి కల్పనే పరమ మంత్రం!
వినూత్న ఆలోచనలకు వేదిక
ఈ ఏడాది ఈఎండీపీ అమలు చేయడంలో జాప్యం చోటు చేసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అమలు చేస్తాం. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈఎండీపీని పరిమిత సెషన్లలో అమలు చేసినా, విజయవంతంగానే పూర్తి చేశాం. విద్యార్థులు వినూత్న ఆలోచనలకు ఈఎండీపీ వేదికగా నిలుస్తుంది.
– జీఎస్‌వీ సుబ్రహ్మణ్యం,
జిల్లా సైన్స్ అధికారి, అమలాపురం
భవితకు పునాది వేసేలా..
తొమ్మిదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న ఈఎండీపీ పాఠాలు వారి భవిష్యత్తుకు చక్కని పునాదిని వేస్తాయి. ముఖ్యంగా ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన ఏర్పడుతుంది. మాడ్యూల్స్ మార్గ దర్శకాలకు అనుగుణంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. భవిష్యత్తు అవకాశాలను ముందే ఊహించడం ద్వారా నిలదొక్కుకునే వీలుంటుంది.
– డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈఓ, అమలాపురం
డిగ్రీలు చేతపట్టి ఎంతకాలం ఎక్కేమెట్టు.. దిగేమెట్టు..? అంబానీ.. అదానీ.. మహీంద్రా.. ఇలా వేళ్లపై లెక్కపెట్టే వ్యాపారవేత్తలు ఎన్ని వేల మందికని ఉద్యోగాలు ఇవ్వగలరు? ఆ వేల మందిలో కొంతమందైనా ఆ వ్యాపారవేత్తలుగా ఎందుకు కాకూడదు? ఆ ఆలోచనల ఫలితమే విద్యార్థి దశ నుంచే వ్యాపారవేత్తల ఆలోచనా ధోరణులు ఎలా ఉంటాయి.. అలా కావాలంటే ఎలాంటి మేధో సంపత్తిని వృద్ధి చేసుకోవాలి. ఎంత స్థాయిలో వృద్ధి చెందితే ఎన్ని వేల మందికి ఉద్యోగ కల్పన చేయవచ్చు వంటి అంశాలపై విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. వారి కృషి ఫలించి సర్టిఫికెట్లు చేతపట్టి నో వేకెన్సీ బోర్డులు వెక్కిరించని పరిస్థితి రావాలని.. చదువులో ఉండగానే ఉద్యోగాలు గెలుచుకునే స్థితిలో మన విద్యార్థులు ఉండాలని కోరుకుందాం.
రాయవరం: సాధారణంగా ఏ విద్యార్థినైనా పదో తరగతి చదివిన తర్వాత ఏమవుతావని అడిగితే.. డాక్టర్, ఇంజినీర్, ఐఏఎస్ ఇలా సమాధానాలు ఇస్తుంటారు. అలా కాకుండా విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా వారిని ఇతర రంగాల వైపు, ముఖ్యంగా ఉత్పాదక రంగాల దిశగా పయనించేలా రాష్ట్ర విద్యాశాఖ ఒక విసూత్న కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది. ఎంటర్‌ప్రెన్యూరల్ మైండ్‌సెట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఈఎండీపీ)ను 2022 నుంచి అమలు చేస్తోంది. విద్యార్థుల వినూత్న ఆలోచనలకు కార్యాచరణ తోడయ్యేలా రూపొందించిన కార్యక్రమం ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభించారు. గత విద్యా సంవత్సరంలో జూన్ నుంచి ప్రారంభించగా, ఈ విద్యా సంవత్సరంలో ఈ ఏడాది జనవరి నుంచి మొదలుపెట్టారు. విద్యార్థి దశ నుంచే పారిశ్రామిక ఆలో చనలు రేకెత్తించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ‘వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. పారిశ్రామిక, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈఎండీపీ అమలు చేశారు. అయితే విద్యార్థులు నేర్చుకున్న పారిశ్రామిక, ఆర్థిక అక్షరాస్యతపై వారికి ఏ మేరకు అవగాహన కలిగిందో తెలుసుకునేందుకు ప్రాజెక్టుల ఎక్స్‌పోను రామచంద్రపురం ఎస్‌కేపీజీఎన్ ఉన్నత పాఠశాలలో గురువారం ఏర్పాటు చేశారు.
కేవలం తొమ్మిది సెషన్లు
విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ఈఎండీపీ ప్రోగ్రామ్ జిల్లాలో ఈ ఏడాది నామమాత్రంగా కొనసాగిందని చెప్పవచ్చు. ఉపాధ్యాయులకు శిక్షణతో పాటు బోధనాంశాలపై విలువైన సమాచారంతో కూడిన ఆన్‌లైన్ మాడ్యూల్స్ అందజేశారు. ఈ మేరకు రీప్ బెనిఫిట్, ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్, ఆఫ్లటూన్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా మాడ్యూల్సు రూపాందించాయి. ఈఎండీపీ పాఠ్యాంశాలను విద్యార్థులు ఆసక్తిగా నేర్చుకున్నారు. గతేడాది నిర్వహించిన ఈఎండీపీ ఎక్స్‌పోలో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. జిల్లా స్థాయి ఎక్స్‌పోలో ప్రదర్శించిన ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి కూడా ఎంపిక కావడం గమనార్హం. ప్రస్తుత ఏడాది ఈఎండీపీ జిల్లా స్థాయి ఎక్స్‌పోను ఏర్పాటు చేస్తున్నారు. ఈఎండీపీ అమలు చేస్తున్న ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు ప్రాజెక్టులు సమర్పించాలి. ఈ ఏడాది వివిధ పాఠశాలల నుంచి 32 ప్రాజెక్టులు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేశారు. వాటి నుంచి ఫైనల్‌గా ఎక్స్‌పోకు 10 ప్రాజెక్టులు ఎంపిక చేశారు. వాటి నుంచి మళ్లీ రెండింటిని కమిటీ రాష్ట్ర స్థాయి ఎక్స్‌పోకు పంపనుంది.
జిల్లాలో పరిస్థితి ఇదీ
జిల్లాలో ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈఎండీపీ పాఠాలు నేర్పిస్తున్నారు. ఇందుకు తొమ్మిదో తరగతి బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చారు. వారు 9వ తరగతి విద్యార్థులకు ప్రతి శుక్రవారం తరగతులు నిర్వహించారు. ఆర్థిక అక్షరాస్యత బోధనలో భాగంగా బడ్జెట్, పొదుపు, ఖర్చు తదితర అంశాలపై చైతన్యం కలిగించారు. సాంకేతికత, ఇతర ఉత్పత్తులను పరిచయం చేస్తున్నారు. సమస్య ఎదురైతే పరిష్కారంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో వివరించారు. 18 అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో కేవలం తొమ్మిది సెషన్లను వారానికి ఒక పీరియడ్ వంతున ఉపాధ్యాయులు బోధించి పూర్తి చేశారు.
9వ తరగతి విద్యార్థులకు
ఈఎండీపీ అమలు
జిల్లాలో 20 వేల మందికి ప్రయోజనం
నేడు రామచంద్రపురంలో ఎక్స్‌పో
ప్రాజెక్టుల ప్రదర్శనకు
విద్యార్థులు సన్నద్ధం

ఉపాధి కల్పనే పరమ మంత్రం!

ఉపాధి కల్పనే పరమ మంత్రం!