
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదాం
కొత్తపేట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఎండగడదామని శాసనమండలిలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా జగ్గిరెడ్డి విశాఖపట్నంలో పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసారు. జగ్గిరెడ్డి, బొత్సను సత్కరించి ఆయన నుంచి ఆశీస్సులు, అభినందనలు అందుకున్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించడం, కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతరేక విధానాలు, నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు, వారి అనుచరవర్గాల ఆగడాలు, ముఖ్యంగా పారదర్శకతకు విరుద్ధంగా వివిధ కార్పొరేషన్ల రుణాల లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయగా, ఈ కూటమి ప్రభుత్వం పారదర్శకానికి తిలోదకాలు వదిలేసి, కూటమి నాయకులు, కార్యకర్తలే పంచేసుకున్నారన్న విషయాన్ని, గత ప్రభుత్వ పథకాలు, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా తమను మోసం చేశారన్న విషయాన్ని ప్రజలు గ్రహించినట్టు పేర్కొన్నారు. జగ్గిరెడ్డి వెంట అముడా మాజీ చైర్మన్, పార్టీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్ రాజు, కొత్తపేట ఎంపీపీ మార్గాన గంగాధరరావు గారు, పార్టీ నాయకులు కర్రి నాగిరెడ్డి, కొవ్వూరి సుధాకర్ రెడ్డి, మాగాపు చక్రవర్తి, బెజవాడ నారాయణరావు, తేతలి సత్తిరెడ్డి తదితరులు ఉన్నారు.
శాసన మండలి విపక్షనేత బొత్స,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి