
కీలక వైద్యం కాకినాడకు!?
● వైద్యులు అందుబాటులో లేక
ప్రత్యామ్నాయ మార్గాలకు రోగులు
● పోస్టుల భర్తీ కోసం ఎదురుచూపులు
● గైనిక్ పోస్టుల్లోనూ డెప్యుటేషన్ విధులు
● ఆర్థోపెడిక్, జనరల్ ఎండీ లేక అవస్థలు
అమలాపురం టౌన్: అది వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి. కోనసీమ పేద ప్రజలకు వైద్య సేవలు అందించే పెద్ద ఆస్పత్రి. అమలాపురం జిల్లా కేంద్రం అయ్యాక ఈ ఆస్పత్రి ప్రాధాన్యం మరీ పెరిగింది. అమలాపురం సమీపంలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు ఈ ఆస్పత్రి బోధనా ఆస్పత్రి అవుతోంది. ఇప్పుడున్న వంద పడకల స్థాయి కాస్తా బోధనా ఆస్పత్రి అయ్యాక 650 పడకలకు అప్‌గ్రేడ్ కానుంది. అంతటి అత్యవసర వైద్య సేవలు అందించే అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నేడు కీలక వైద్య పోస్టులు భర్తీ చేయడంలో ప్రభుత్వం అలక్ష్యం వహిస్తోంది. ఫలితంగా ఆయా కీలక విభాగాలకు వైద్యులు లేక ఆ వైద్య సేవలు పూర్తి స్థాయిలో రోగులకు అందడం లేదు. రోజూ 400 నుంచి 500 వరకూ ఓపీ ఉండే ఈ ఆస్పత్రిలో 70 నుంచి 80 మంది వరకూ ఇన్ పేషెంట్లు ఉంటారు. ఇలాంటి పెద్దాసుపత్రిలో రెగ్యులర్ గైనిక్‌లు (ప్రసూతి నిపుణులు) లేక అరకొర వైద్య సేవలు అందుతున్నాయి. ఆస్పత్రికి మూడు రెగ్యులర్ గైనిక్ వైద్యులు ఉండే వారు. ఇందులో రెండు పోస్టులు గతంలోనే ఖాళీ అయ్యాయి. మూడో పోస్టు మొన్నటి వరకూ ఉండేది. ఆ గైనిక్ డాక్టర్ మెటర్నిటీ లీవులో వెళ్లడంతో ఆస్పత్రిలో రెగ్యులర్ గైనిక్‌లు లేకుండా పోయింది. దీంతో పి.గన్నవరం ప్రభుత్వ వైద్యాలయం నుంచి ఓ గైనిక్ డాక్టర్ డిప్యూటేషన్‌పై వారంలో మూడు రోజులు అమలాపురం ఆస్పత్రికి వచ్చి సేవలు అందిస్తున్నారు. ఆ వైద్యుడు విధుల్లో లేని మిగిలిన రోజుల్లో ఎవరైనా గర్భిణి లేదా బాలింత అత్యసర వైద్యం కోసం వస్తే గైనిక్ డాక్టర్ లేరన్న సమాధానం లేదా వేరే ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలన్న సలహా మాత్రం ఆస్పత్రి సిబ్బంది నుంచి అనివార్యమవుతోంది.
ఆర్థోపెడీషియన్ లేక..
ఆస్పత్రిలో మరో కీలకమైన పోస్టు ఆర్థోపెడిక్ వైద్యుడు. ఆ పోస్టు ఖాళీగా ఉండి వైద్యడు లేకపోవడంతో ఏదైనా రోడ్డు ప్రమాదం లేదా మరేదైనా సంభవించినప్పుడు కాళ్లు, చేతులు విరిగిన సందర్భాలలో ఆస్పత్రిలో శస్త్ర చికిత్స అటుంచి కనీసం ప్రాథమిక వైద్యం అందించే పరిస్థితి కూడా లేదు. ఇక జనరల్ ఎండీ పోస్టు లేక డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర జ్వరాలకు అందే సాధారణ వైద్యం కూడా సక్రమంగా అందడం లేదు.
ఆస్పత్రిలో ఇలా కీలకమైన గైనిక్‌లు ముగ్గురి వైద్యులు, ఆర్థోపెడిక్ వైద్యుడు, జనరల్ ఎండీ ఈ అయిదు పోస్టులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. గర్భిణులు, బాలింతలు ఈ ఆస్పత్రికి వచ్చి వైద్యలు అందుబాటులో లేక ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. కొందరైతే ప్రైవేటు ఆస్పత్రులను విధి లేక ఆశ్రయించి వేలకు వేలు బిల్లులు చెల్లిస్తున్నారు.
త్వరలోనే వైద్య పోస్టుల భర్తీ
ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఖాళీ పోస్టుల భర్తీ త్వరలోనే జరగనుంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 65 వైద్య పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగితే కేవలం 22 పోస్టులే భర్తీ అయ్యాయి. ఆ పోస్టుల్లో అమలాపురం ఆస్పత్రికి భర్తీ కాలేదు. గైనిక్ డాక్టర్ డిప్యూటేషన్‌పై వారానికి మూడు రోజులు ఇక్కడే ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు. మూడు రెగ్యులర్ గైనిక్ పోస్టుల్లో ఒక వైద్యురాలు మెటర్నిటీ లీవులో వెళ్లడం వల్ల డిప్యూటేషన్ విధానంలో మరో వైద్యురాలిని నియమించాం. రెండు లేదా మూడు వారా ల్లో వైద్య పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది.
– డాక్టర్ కె.శంకరరావు,
సూపరింటెండెంట్, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి,
అమలాపురం
అందుకే రిఫర్ టూ కాకినాడ
గర్భిణులు, బాలింతలకు ఏదైనా అత్యవర వైద్యం లేదా శస్త్ర చికిత్స అనివార్యమైనా, రోడ్డు ప్రమాదాల్లో కాళ్లు లేదా చేతులు విరిగిపోయినా ఆ కేసులను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి ఇక్కడ వైద్యులు సిఫార్సు చేసి ఆ లేఖను చేతిలో పెడుతున్నారు. కొందరైతే కాకినాడకు వెళ్లే బదులు ఇక్కడే ఏదైనా ప్రైవేటు ఆస్పతికి వెళ్లి వైద్యం చేయించుకుంటే బాగుంటుందన్న అభిప్రాయంతో ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తున్నారు. ఆస్పత్రిలో దాదాపు 12 వైద్య పోస్టులు ఉన్పప్పటికీ కీలక పోస్టులు లేకపోవడంతో రోగుల సంఖ్య కూడా ఆస్పత్రికి తగ్గిపోతోంది.

కీలక వైద్యం కాకినాడకు!?

కీలక వైద్యం కాకినాడకు!?