
కొత్తపేట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర రోడ్ షోను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి పార్టీ శ్రేణులు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఆయన బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ సీఎం జగన్ రోడ్ షో షెడ్యూల్‌ను వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలో తేతలి నుంచి గురువారం ఉదయం 9 గంటలకు జాతీయ రహదారి మీదుగా రోడ్ షో ప్రారంభమవుతుందన్నారు. అక్కడి నుంచి తణుకు బైపాస్, పెరవలి, సిద్ధాంతం అడ్డరోడ్డు మీదుగా వశిష్ట వారధిని దాటి కొత్తపేట నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. అనంతరం గోపాలపురం, ఈతకోట మీదుగా ఉదయం 10.30 గంటలకు రావులపాలెం సెంటర్‌కు చేరుకుంటుందన్నారు. గౌతమి వారధి మీదుగా జొన్నాడ సెంటర్, మూలస్థానం, చొప్పెల్ల, చెముడులంక, మడికిలో సాగుతుంది. అక్కడితో కొత్తపేట నియోజకవర్గ రోడ్ షో పూర్తవుతుందని, ఆ తర్వాత పొట్టిలంక మీదుగా కడియపులంక చేరుకుంటుందన్నారు. అక్కడ భోజన విరామం అనంతరం 4 గంటలకు బయలుదేరి వేమగిరి సెంటర్, బొమ్మూరు సెంటర్, తాడితోట సెంటర్, దేవీచౌక్ సెంటర్, సీతంపేట, దివాన్‌చెరువు, రాజానగరం మీదుగా రోడ్ షో పూర్తి చేసుకుని ఎస్‌టీ రాజాపురంలో రాత్రి బస ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని రావులపాలెం, ఆలమూరు మండలాల్లో రోడ్ షో జరుగుతుండగా ఆయా మండలాలతో పాటు కొత్తపేట, ఆత్రేయపురం మండలాల నుంచి అత్యధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానుల మోటార్ సైకిల్ ర్యాలీతో రోడ్ షో సాగుతుందన్నారు.
నేటి ఉదయం 10 గంటలకు
రావులపాలెం సెంటర్‌కు రాక
ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి