క్రీడాకారులను తయారు చేసుకోవాలి
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు
అమలాపురం టౌన్: క్రీడాకారులు అప్పటికప్పడు పుట్టరని, ప్రతిభ గల క్రీడాకారులను మనం తయారు చేసుకుంటేనే వారు అంచలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయికి ఎదుగుతారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. పాఠశాలల స్థాయిలోనే విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపి క్రీడాంశాలవారీగా వారి ఆసక్తిని బట్టి నిష్ణాతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దినప్పుడే క్షేత్రస్థాయి నుంచి క్రీడా వ్యవస్థ బలపడుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో క్రీడా స్ఫూర్తి అంశంపై వివరించారు. ఇప్పడు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించాలన్న ఆలోచనను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేసి పాఠశాలల విద్యార్థుల్లో వారి వారి అభిరుచులను బట్టి క్రీడా స్ఫూర్తి నింపి సత్ఫలితాలు సాధించారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా ఆ తరహా ప్రయత్నం సాగాలని ఆకాంక్షించారు. స్పోర్ట్ పాలసీలు తయారు చేసినప్పుడు క్రీడలపై అవగాహన లేని ఐఏఎస్ అధికారులు సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోకూడదని సూచించారు. స్పోర్ట్స్ పాలసీ రూప కల్పనలో విశ్రాంత స్పోర్ట్స్ ఉన్నతాధికారులు, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారుల ఆలోచనలు, సూచనలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
వేణుగోపాలస్వామికి
వెండి ఆభరణాల సమర్పణ
మామిడికుదురు: మండలంలోని మొగలికుదురు గ్రామంలో కొలువుదీరిన శ్రీరుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామికి గ్రామానికి చెందిన దండు భీమరాజు, విజయలక్ష్మి దంపతులు రూ.1.5 లక్షల విలువైన వెండి ఆభరణాలను ఆదివారం సమర్పించారు. శ్రావణమాసం సందర్భంగా భీమరాజు దంపతులు స్వామి వారికి వెండి కవచం, శంఖు చక్రాలు తదితర ఆభరణాలను అందజేశారు. అర్చక్షులు సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వెండి ఆభరణాలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
నేడు యథావిధిగా ప్రజా
ఫిర్యాదుల పరిష్కార వేదిక
అమలాపురం రూరల్: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి తగు పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
లోవలో భక్తుల సందడి
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో సందడి నెలకొంది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు ఎనిమిది వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,19,975, పూజా టికెట్లకు రూ.65,930, కేశఖండనశాలకు రూ.15,040, వాహన పూజలకు రూ.6,200, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.74,392, విరాళాల ద్వారా రూ.85,353, మొత్తం రూ.3,76,890 ఆదాయం సమకూరినట్టు ఈఓ వివరించారు.
సత్యదేవుని నిత్యాన్నదాన
పథకానికి రూ.1,00,001
అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పఽథకానికి రాయుడు శ్రీనివాసరావు (కాకినాడ) రూ.1,00,001 విరాళాన్ని ఆది వారం సమర్పించారు. దాతకు అన్నదానం రశీదు, బాండ్‌ను అధికారులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment