ఇన్‌స్పైర్‌ మనక్‌కు ప్రాజెక్టుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఇన్‌స్పైర్‌ మనక్‌కు ప్రాజెక్టుల ఆహ్వానం

Aug 10 2024 4:10 AM | Updated on Aug 10 2024 4:10 AM

ఇన్‌స్పైర్‌ మనక్‌కు  ప్రాజెక్టుల ఆహ్వానం

ఇన్‌స్పైర్‌ మనక్‌కు ప్రాజెక్టుల ఆహ్వానం

సాక్షి, అమలాపురం: సమగ్ర శిక్ష, విద్యాశాఖ సంయుక్తంగా చేపట్టే ‘ఇన్‌స్పైర్‌ మనక్‌ 2024–25’ కోసం వివిధ ప్రాజెక్టుల నమోదుకు నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఈ మేరకు పాఠశాల వారీగా ఐదు ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కలెక్టరేట్‌లో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రస్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకు వచ్చే ప్రాజెక్టులను ఎంపిక చేయాలని కలెక్టర్‌ సూచించారు. ప్రతి రెండు వారాలకు తనతో పాటు, జిల్లా విద్యాశాఖ అధికారి పాఠశాల స్థాయి ప్రాజెక్టులను సమీక్షిస్తామని ఆయన పేర్కొన్నారు. డీఈవో ఎం.కమలకుమారి ఉప విద్యాశాఖ అధికారి సూర్యప్రకాష్‌ జిల్లా సైన్స్‌ అధికారి జీవీవీ సుబ్రహ్మణ్యం, సైన్స్‌ ప్రాజెక్ట్‌ అధికారి కడలి సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

సహకార సంఘాల

డేటా ఆన్‌లైన్‌ చేయాలి

అమలాపురం రూరల్‌: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఉన్న 166 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలోని డేటాను ఆన్‌లైన్‌ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిశాంతి సంఘాల అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతి నుంచి రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి అహ్మద్‌ బాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయమై దిశా నిర్దేశం చేశారు. సమీక్ష అనంతరం జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ రెండు నాటికి రికార్డులను ఆన్‌లైన్‌ చేయాలని ఆదేశించిందని అన్నారు. ఈ మేరకు 166 ఫ్యాక్స్‌ కేంద్రాలలో సైట్‌ ప్రిపరేషన్‌కు చర్యలు చేపట్టి డేటాను ఆన్‌లైన్‌ చేయాలని ఆదేశించారు. రోజువారీగా ఆన్‌లైన్‌ చేసిన డేటాపై సమీక్షిస్తామన్నారు. అత్యంత పారదర్శకంగా, అవకతవకలకు ఆస్కారం లేకుండా ఆన్‌లైన్‌ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆమె తెలిపారు. వెబ్‌ ల్యాండ్‌ రెవెన్యూ రికార్డులు, మీసేవ మార్కెఫెడ్‌ కామన్‌ సర్వీస్‌ సెంటర్‌, సున్నా వడ్డీ పంట రుణాలు, తదితర అంశాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 27 శాతం మాత్రమే కంప్యూటరైజ్‌ చేసినట్టు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి ఎస్‌.మురళీకృష్ణ, సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలల్లో డీఈఓ తనిఖీ

హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు షోకాజ్‌ జారీ

తాళ్లరేవు: మండల పరిధిలోని పలు పాఠశాలల్లో డీఈఓ పిల్లి రమేష్‌ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థుల ప్రగతిని స్వయంగా పరిశీలించారు. పరిమితికి మించి సెలవులు పెట్టిన ఒక పాఠశాల హెచ్‌ఎంతో పాటు, మరో పాఠశాలలో పాఠశాల నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మండల పరిధిలోని పటవల పంచాయతీ కొత్తూరు ఎంపీపీ పాఠశాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. స్కూల్‌ హెచ్‌ఎం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 35 సెలవులు వాడడంతో పాటు సరైన సెలవు రికార్డుల నిర్వహించకపోవడంపై ఆమెకు షోకాజ్‌ జారీ చేశారు. అనంతరం కోరింగ జిల్లా ప్రజా పరిషత్‌ హైస్కూల్‌ను సందర్శించి నాడు–నేడు పనులు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. పాఠశాల నిర్వహణ, పథకాల రికార్డులు సక్రమంగా లేకపోవడంతో హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయులందరికీ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మండల విద్యాశాఖ కార్యాలయాన్ని సందర్శించి యూ డైస్‌ ప్లస్‌, స్టూడెంట్‌ డ్రాప్‌ బాక్స్‌ గురించి సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. పాఠశాలల్లో విద్యాకానుకల పంపిణీ, మండలానికి కావలసిన కిట్ల గురించి అధికారులతో చర్చించారు. ఆయన వెంట సీఆర్‌పీలు, ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.

12న వికాసలో జాబ్‌ మేళా

కాకినాడ సిటీ: ఈ నెల 12వ తేదీ సోమవారం వికాస కార్యాలయంలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు వికాస పీడీ కె.లచ్చారావు శుక్రవారం తెలిపారు. ఈ జాబ్‌మేళాలో హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, సీఎంఆర్‌ టెక్స్‌టైల్స్‌ అండ్‌ జ్యూయలరీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌, క్యాషియర్‌ అండ్‌ సెక్యూరిటీ, రాక్‌మెన్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, డిక్సాన్‌, హోండాయ్‌ మోబీస్‌ కంపెనీల్లో టెక్నిషియన్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు లచ్చారావు తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, బీటెక్‌ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.12 వేల నుంచి రూ. 20 వేల వరకు జీతం, ఇన్సెంటివ్స్‌, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement