
జిల్లాలో ‘ఎస్‌ఎంసీ’ ఎన్నికలు
రాయవరం: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)ల ఎన్నికలు గురువారం నిర్వహించారు. ఆయా హెచ్‌ఎంల నేతృత్వంలో జిల్లాలో 1,273 ప్రాథమిక, 72 ప్రాథమికోన్నత, 237 ఉన్నత పాఠశాలల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 544 ప్రాథమిక, 25 ప్రాథమికోన్నత, 78 ఉన్నత పాఠశాలల్లో ఏకగ్రీవమయ్యాయి. 728 ప్రాథమిక, 47 ప్రాథమికోన్నత, 159 ఉన్నత పాఠశాలల్లో చేతులెత్తే విధానంలో ఎన్నికలు చేపట్టారు. కోరం లేక మలికిపురం మండలం గొల్లపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎన్నిక వాయిదా పడింది. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో తరగతుల వారీగా కమిటీ సభ్యుల ఎన్నిక చేతులెత్తే విధానంలో జరిగింది. తరగతికి ముగ్గురు చొప్పున సభ్యులను తల్లిదండ్రులు ఎన్నుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఎన్నికై న కమిటీ సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. రెండేళ్ల పదవికి కమిటీలు ఎన్నికయ్యాయి. వీటిని కలెక్టర్ మహేష్‌కుమార్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.కమలకుమారి, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఎ.మధుసూదనరావు, ఎస్‌ఎంసీ ఎన్నికల నోడల్ అధికారి, సీఎంఓ బీవీవీ సుబ్రహ్మణ్యం తదితరులు పర్యవేక్షించారు.