
ఆర్టీసీ కండక్టర్ నిజాయితీ
అమలాపురం రూరల్: అమలాపురం ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ ప్రయాణికుడు పోగొట్టుకున్న రెండు కాసుల బంగారు గొలుసును అతనికి అందించి ఓ కండక్టర్ నిజాయితీ చాటుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. కాజులూరు మండలం అండ్రంగికి చెందిన మాచవరపు కృష్ణ కుటుంబ సభ్యులతో కలసి పాలకొల్లు వెళ్లడానికి అమలాపురం బస్టాండ్‌కు శుక్రవారం వచ్చారు. అతని రెండు కాసుల బంగారు గొలుసు బస్టాండ్‌లో పడిపోయింది. ఆ గొలుసు అమలాపురం డిపో కండక్టర్ పి.నారాయణరావుకు దొరికింది. దానిని డిపో అధికారులకు అప్పగించారు. గొలుసును పోగొట్టుకున్న ప్రయాణికుడు అమలాపురం బస్టాండ్‌లోని విచారణ కేంద్రం వద్ద సంప్రదించగా శనివారం ఆ గొలుసును సెక్యూరిటీ అధికారి, సీఐ పతిమాకుమారి, ఓపీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఎన్.వరహాలుబాబు సమక్షంలో కండక్టర్ నారాయణరావు ప్రయాణికుడు కృష్ణకు అందజేశారు. నిజాయితీ చాటుకున్న కండక్టర్‌ను డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి అభినందించారు.