ఇంటింటా వరాలమ్మకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఇంటింటా వరాలమ్మకు ఆహ్వానం

Published Fri, Aug 16 2024 10:44 AM | Last Updated on Fri, Aug 16 2024 10:44 AM

ఇంటిం

ఇంటింటా వరాలమ్మకు ఆహ్వానం

రాయవరం: శ్రావణం దేవతలకు ఇష్టమైన మాసమని పురాణాలు చెబుతున్నాయి. ముత్తైదువలు, దీర్ఘ సుమంగళీతనం కోసం ఆచరించే వరలక్ష్మీ వ్రతానికి విశేష ప్రాముఖ్యం ఉంది. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి మొదట వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అష్టలక్ష్మి రూపాన్ని మహిళలు వరలక్ష్మిగా కొలుస్తారు. దీర్ఘకాలం సుమంగళిగా ఉండాలని వివాహితులు, మంచి భర్త లభించాలని యువతులు వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించడం ద్వారా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. వ్రతం రోజున వేకువనే ఇంటిని శుభ్రపర్చుకుని, గుమ్మాలకు పచ్చని మామిడి తోరణాలు, బంతిపూలను కట్టి అందంగా తీర్చిదిద్దుతారు. వ్రతం నిర్వహించే ప్రదేశంలో పిండితో ముగ్గు వేసి, కలశానికి పసుపు పూసి, నీటితో నింపి మామిడి ఆకులు, కొబ్బరికాయను ఉంచి కొత్త రవికెను కలశంపై ఉంచి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అష్టోత్తర శతనామాలతో దేవిని పూజించి షడ్రసోపేతమైన మహా నైవేద్యాన్ని ఉంచి భుజిస్తారు. చుట్టుపక్కల ఉన్న సువాసినులను వ్రతానికి పిలిచి వాయనాలు, తాంబూలాలు అందజేసి పూజ ముగిస్తారు. ఇళ్లతో పాటు ఆలయాల్లోనూ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయాల్లో నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

పూలు, పండ్లకు గిరాకీ

మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే వరలక్ష్మీ వ్రతం పూజా సామగ్రి కొనుగోలుతో మార్కెట్‌ సందడిని సంతరించుకుంది. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ ప్రత్యేకంగా స్టాల్స్‌ ఏర్పాటు చేసి పూజా సామగ్రి విక్రయాలు చేపట్టారు. వ్రతానికి అవసరమైన పసుపు, కుంకుమ, గంధం, పూలు, మామిడాకులు, అరటిపండ్లు, అమ్మవారి ఫొటో, కలశం, కొబ్బరికాయలు, తమలపాకులు, వక్కలు తదితర పూజా వస్తువులు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో పూలకు, పండ్లకు, కొబ్బరికాయలకు గిరాకీ పెరిగింది. కిలో చేమంతి పూలు రూ.400 వరకు ధర పలుకుతున్నాయి. కొబ్బరికాయ ధర రూ.20 నుంచి రూ.30 పలుకుతుండగా, అరటిపండ్లు డజను రూ.50 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారు. ఒక్కో తామరపూవు రూ.25 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత నేపథ్యంలో మహిళల భక్తిని వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. ఇక పండ్ల ధరలు చెప్పనక్కరలేకుండా ఉన్నాయి. అలాగే ఇళ్లకు వచ్చి వ్రతాలు చేసే పురోహితులకు సైతం డిమాండ్‌ పెరిగింది.

రూపు అంటే మాటలా!

శుభప్రదమైన శ్రావణమాసంలో వ్రతం చేస్తే సిరిసంపదలకు లోటుండదనేది భక్తుల విశ్వాసం. అయితే శ్రావణంలో పూజలు చేయాలంటే మార్కెట్‌లో పెరిగిన ధరలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని రూ.5 వేలు అయినా అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంప్రదాయంగా పూజలో ఉంచే లక్ష్మీదేవి బంగారం రూపు, నూతన వస్త్రాలు, పండ్లు, పూల ధరలు మహిళలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ మాసంలో బంగారం కొంటే మంచిదని మహిళల నమ్మకం. వరలక్ష్మీ పూజకు విధిగా బంగారం రూపు ఉండాలని వారు కోరుకుంటారు. ప్రస్తుతం తులం బంగారం రూ.85,150 పలుకుతోంది. అణా బరువున్న వరలక్ష్మీ రూపు రూ.5,500 వేలు ఉంది. గ్రాము రూపు రూ.7,500 చెప్తున్నారు. వరలక్ష్మి రూపులు రూ.2,000, రూ.4000, రూ.5,000 ధరల్లో లభిస్తున్నాయి. తక్కువ ధరకు కొంటే అందులో పైపూత తప్ప లోపలంతా రాగే. ఈ పరిస్థితుల్లో మంచి రేటు పెట్టి కొనకుంటే వరలక్ష్మీ రూపు రావడం గగనమే.

సకల శుభాలు కలుగుతాయి

శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. తొమ్మిది సూత్రాలతో కూడిన దారాన్ని అమ్మవారి విగ్రహం వద్ద ఉంచి వ్రతపూజలు చేసుకుని కుడిచేతికి కట్టుకుంటే ఎంతో మంచిది. వరలక్ష్మీ వ్రతాన్ని ఎవరి శక్తి కొలది వారు చేసుకోవాలి.

– కూరెళ్ల శివ, పురోహితుడు, రాయవరం

వరలక్ష్మీ రూపులు

నేడు వాడవాడలా వరలక్ష్మి వ్రతం

వ్రతమాచరించనున్న మహిళలు

మార్కెట్లకు శ్రావణ శోభ

No comments yet. Be the first to comment!
Add a comment
ఇంటింటా వరాలమ్మకు ఆహ్వానం1
1/2

ఇంటింటా వరాలమ్మకు ఆహ్వానం

ఇంటింటా వరాలమ్మకు ఆహ్వానం2
2/2

ఇంటింటా వరాలమ్మకు ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement