
అతివేగం.. ఆపై నిర్లక్ష్యం
ఫ ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఫ పది మందికి గాయాలు
అంబాజీపేట: అతివేగం.. ఆపై నిర్లక్ష్యంగా ఆర్టీసీ బస్సును నడిపి ఓ ఆటోను బలంగా ఢీకొనడంతో అందులో ప్రయాణికులు పది మంది గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. అల్లవరం మండలం నుంచి పది మంది మహిళలు పాసింజర్ ఆటోలో ముంగండ వద్ద రొయ్యిల పరిశ్రమలో పని నిమిత్తం బయలు దేరారు. వీరి ఆటో అంబాజీపేట నాలుగు రోడ్ల కూడలికి వచ్చేసరికి రావులపాలెం నుంచి వయా సీ్త్రల ఆస్పత్రి మీదుగా అమలాపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా దూసుకువచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న బెండమూరిలంకకు చెందిన బొంతు లక్ష్మీరాధిక, మట్టపర్తి వరలక్ష్మి, వాసర్ల పద్మ, బొంతు దుర్గ, గోడితిప్పకు చెందిన కొల్లి లక్ష్మి, సరెళ్ల అనంతలక్ష్మి, బొంతు సత్యవతి, పిల్లా దేవి, సరెళ్ల దేవి, దేవగుప్తానికి చెందిన ఆటో డ్రైవర్ యు.నాగరాజులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా నాలుగు స్థానిక రోడ్ల సెంటర్‌లో రాజోలు, అమలాపురం ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు అతి వేగంగా వెళుతున్నాయని, వీటిని నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.