
బాధితురాలి నుంచి వివరాలు సేకరిస్తున్న ఎస్సై మౌనిక
గోపాలపురం: బిల్డింగ్‌పై నుంచి పడి తాపీమేస్త్రి మృతి చెందిన ఘటన భీమోలు గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్సై కర్రి సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపురానికి చెందిన షేక్ యాసీన్ (36) తాపీమేస్త్రి. బుధవారం భీమోలు గ్రామంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ బిల్డింగ్‌పై నుంచి జారి పడ్డాడు. తలకు తీవ్రగాయమైన అతడిని గోపాలపురం సీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ మెడలో గొలుసు చోరీ
సామర్లకోట: పట్టపగలే మహిళ మెడలో గొలుసును దొంగ తెంపుకొని పారిపోయాడు. సత్యనారాయణపురంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. బాధితురాలు నాగం సత్యవతి సమీపంలోని రామాలయం వద్దకు వెళ్లడానికి తయారవుతోంది. ఆ సమయంలో సుమారు 40 ఏళ్ల ఒక వ్యక్తి ఇంటికి వచ్చాడు. ఏమి కావాలని అడిగేలోపు సత్యవతి పీకనొక్కి మెడలోని గొలుసును లాక్కుని పరారయ్యాడు. ఆ ఐదు కాసుల బంగారు గొలుసులో రెండు కాసుల ముక్కను దొంగ లాక్కుని పరారయ్యాడు. మూడు కాసుల ముక్క సత్యవతి చేతిలో ఉండిపోయింది. వార్డు కౌన్సిలర్ సేపెని సురేష్ ఫిర్యాదు మేరకు ఎస్సై మౌనిక సంఘటనా ప్రదేశానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.