
మహాలక్ష్మీ నమో నమః
● వెదురుపాక పీఠంలో
వార్షికోత్సవాలు ప్రారంభం
● నేత్రపర్వంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం
రాయవరం: శ్రీమహాలక్ష్మీ నమో నమః అంటూ ఆ అమ్మవారిని కొలిచారు.. ప్రత్యేక పూజలు చేశారు. దీనికి రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠం వేదిక అయ్యింది. పీఠం 52వ వార్షికోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. 1972లో పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం (గాడ్) పీఠం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏటా పీఠం వార్షికోత్సవాలను ఆగస్టు 16న ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం విజయదుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు, నవగ్రహ మండపారాధన చేశారు. కొల్హాపూర్ వేద పండితులచే శ్రీమహాలక్ష్మి అమ్మవారికి తిరుమంజనం అర్చన, హోమం నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు తమిళనాడు తిరుత్తణి ఆలయ అర్చకులచే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం (గాడ్) మాట్లాడుతూ లోక కల్యాణార్థం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కళ్యాణోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. పీఠంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పీఠం ప్రతినిధుల ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు. అన్నవరం దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ ఐవీ రోహిత్, ఇన్‌చార్జి ఈఓ డి.రమేష్‌బాబులు విజయదుర్గా పీఠాన్ని సందర్శించి, గాడ్ ఆశీస్సులు అందుకున్నారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు భాస్కరనారాయణ, జి.సత్యవెంకటకామేశ్వరి, పి.సత్యకనకదుర్గ, బి.రమ, పీఠం పీఆర్వో వి.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక అలంకరణలో విజయదుర్గమ్మ

మహాలక్ష్మీ నమో నమః
Comments
Please login to add a commentAdd a comment