జిల్లాకు 57 లక్షల ఉపాధి పనిదినాలు
అమలాపురం రూరల్: ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన పనులను గుర్తించి నివేదిక ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఉపాధి హామీ పనులపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు తమ శాఖల్లో ఉపాధి హామీ పనులు కింద చేయడానికి అవకాశం ఉన్న పనుల వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ఉపాధి హామీ పథకం కింద 57 లక్షల పని దినాలను లక్ష్యంగా ఇచ్చారని, వాటిని చేరుకునేలా పనులను గుర్తించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. మెటీరియల్, లేబర్ కాంపోనెంట్ల కింద జిల్లాలో 266 రకాల పనులను చేపట్టవచ్చన్నారు. ఆగస్టు 23న రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో ప్రత్యేక సభలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో గ్రామ సభలకు కనీసం 30 శాతం మంది ప్రజలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏపీవోలు, ఏపీడీలు ముందుగానే సమావేశమై ప్రస్తుతం జరుగుతున్న, జరగబోయే పనుల ప్రణాళిక రూపొందించుకుని గ్రామ సభలలో ఆమోదం తీసుకోవాలనన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్‌ఓ ఎం.వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ మధుసూదన్, జిల్లా ఉధ్యానశాఖ అధికారి బీవీ రమణ పాల్గొన్నారు.
దేవాలయాల అభివృద్ధికి ప్రతిపాదనలు
ప్రసాద్ పథకంలో దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం దేవదాయ ధర్మాదాయ శాఖపై సమీక్షించారు. జిల్లాలో దేవదాయశాఖ పరిధిలోని ఆలయాలు, వాటిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు తదితర వాటిపై ఆరా తీశారు. జిల్లాలో సుమారు 216 ఎకరాల దేవాలయ భూములు ఆక్రమణకు గురయ్యాయని అధికారులు తెలపగా, తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్ద మొత్తంలో ప్రసాదాలు తయారు చేస్తున్న దేవాలయాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి నాణ్యతను పరీక్షించాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్టీవో జి.కేశవవర్ధన్ రెడ్డి, జిల్లా దేవదాయ ధర్మాదాయశాఖ అధికారి ఎం.లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ మనోహర్, అంతర్వేది ఈవో సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
జిల్లాలో ముఖ్యమైన ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోని రికార్డు రూమ్‌లను సీసీ టీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించే దిశగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఈ విషయంపై మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులు, ఎస్‌ఎన్‌ఆర్ ఈ–డేటా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లోని (తహసీల్దార్ ) రికార్డు రూమ్‌లు, సంక్షేమ హాస్టళ్లు, ఇసుక రీచ్‌లు, ఇసుక నిల్వ కేంద్రాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం ద్వారా పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
సమన్వయంతో లక్ష్యాన్ని చేరుకోవాలి
అధికారులతో కలెక్టర్ మహేష్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment