నిర్దిష్ట వ్యవధిలో సమస్యలు పరిష్కరించండి
జాయింట్ కలెక్టర్ నిషాంతి
అమలాపురం రూరల్: మారుమూల గ్రామాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వచ్చే అర్జీదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అధికారులకు సూచించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్ గోదావరి భవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జేసీతో పాటు డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ ఎం.ఝాన్సీరాణి, డీఆర్డీఏ పీడీ డాక్టర్ వి.శివశంకర్ ప్రసాద్‌లు ప్రజల నుంచి 126 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిషాంతి మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ఒకవేళ పరిష్కారానికి ఆస్కారం లేని ఫిర్యాదులు వస్తే అందుకు గల కారణాలను సంబంధిత ఫిర్యాదుదారులకు తెలపాలన్నారు. ఫిర్యాదులు నమోదు విభాగాన్ని ఆమె స్వయంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. దివ్యాంగుల వద్దకు జాయింట్ కలెక్టర్ వెళ్లి అర్జీలు స్వీకరించారు. జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి కార్తీక్‌రెడ్డి, సీపీఓ వెంకటేశ్వర్లు, ట్రాన్స్‌కో ఈఈ మోకా రవికుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎన్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సేంద్రీయ ఉత్పత్తులతో ఆరోగ్యం
సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ఆరోగ్యకర జీవనాన్ని గడపవచ్చని జాయింట్ కలెక్టర్ నిషాంతి తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను ఆమె ప్రారంభించి, పలు ఉత్పత్తులను కొనుగోలు చేశారు. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు నేటి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ స్టాల్‌లో కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, దేశవాళీ రకాలైన నల్ల బియ్యం తదితర రకాలు ఉన్నాయని ఆమె తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు, డీపీఎం కె.శ్రీనివాస్, అడిషనల్ డీపీఎం సత్యనారాయణ, ఆదర్శ రైతు అప్పారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment