
సర్దుబాటు బహిష్కరణ
అమలాపురం టౌన్: విద్యాశాఖ తలపెట్టిన వర్క్ అడ్జస్ట్‌మెంట్ (ఉపాధ్యాయుల పని సర్దుబాటు)పై ఉపాధ్యాయ సంఘాలు ససేమిరా అంటున్నాయి. అసంబద్ధమైన ఈ ప్రక్రియను తాము బహిష్కరిస్తున్నట్లు జిల్లా ఫాప్టో శాఖ స్పష్టం చేసింది. అలాగే పీఆర్‌టీయూ ఉపాధ్యాయ సంఘం కూడా పని సర్దుబాటును బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ రెండు జిల్లా స్థాయి సంఘాలకు చెందిన ఉపాధ్యాయులు సర్దుబాటు కార్యక్రమానికి సహాయ నిరాకరణ ఉంటుంటుందని చెబుతున్నారు. జిల్లా ఫాప్టోకు సంబంధించిన ఎస్‌టీయూ, యూటీఎఫ్ జీహెచ్‌ఎం అసోసియేషన్ నాయకులు నాగిరెడ్డి శివప్రసాద్, పోతంశెట్టి దొర బాబు, ఎస్‌ఎస్ పల్లంరాజు, పెంకే వెంకటేశ్వరరావు, నారాయణ శ్రీనివాసరావు, నిమ్మకాయ ల గణేశ్వరరావు అమలాపురంలో జరిగిన సమావేశంలో పని సర్దుబాటును వ్యతిరేకించారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు దీపాటి సురేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి వాడ్రేవు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ మొంగం అమృతరావు సైతం ఆ ప్రక్రియను వ్యతిరేకించారు.
అగ్రి కోర్సు
దరఖాస్తులకు ఆహ్వానం
రాజమహేంద్రవరం రూరల్: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 4 సంవత్సరాల బీఎస్సీ(హానర్స్) కోర్సు ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి.శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఆరు ప్రభుత్వ కళాశాలలు, ఆరు అనుబంధ కళాశాలలు ఉన్నాయన్నారు. 2024–25 విద్యాసంవత్సరం కోర్సు ప్రవేశాలకు ఆసక్తిగల విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఐఎన్ యూనివర్శిటి వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఇందులో కోర్సు వివరాలు, అర్హత, వయోపరిమితి, రైతు వారి కోటా వివరాలు ఇస్తామన్నారు. అపరాధ రుసుంతో ఈనెల 30వతేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
‘పంపా’ రైతుల
ఆశలకు లీకేజీ
అన్నవరం: స్థానిక పంపా రిజర్వాయర్ బ్యారేజీ గేట్లుకు ఎన్ని సార్లు మరమ్మతులు చేసినా సమస్య మళ్లీ మొదటికి వస్తోంది. గత జూన్‌లో పంపా బ్యారేజీ గేట్లకు సుమారు రూ.20 లక్షలతో మరమ్మతులు చేపట్టినా నాలుగో నెంబర్ గేటు మాత్రం ఇంకా రిజర్వాయర్ అధికారులకు సమస్యగానే మిగిలింది. పంపా రిజర్వాయర్‌లో వంద అడుగుల నీటిమట్టంతో గణనీయంగా నీరు ఉన్నప్పటికీ నాలుగో నంబర్ గేటు నుంచి ఇంకా నీరు లీకవుతోంది. ఈ గేటు ద్వారా పది క్యూసెక్కుల నీరు వృఽథాగా పోతుండడంతో అటు అధికారులు, ఇటు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నీటి లీకేజీని అరికట్టేందుకు ఎండుగడ్డి మోపులుగా కట్టి గేటు దిగువన ఉంచేందుకు రిజర్వాయర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.
ఖరీఫ్‌పై ఆశ చిగురించిన వేళ... నీటి లీకేజీ..
జూలై రెండో వారం నుంచి ఆగస్టు మొదటి వారం వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా పంపా రిజర్వాయర్ నీటిమట్టం పెరగడంతో ఆయకట్టు రైతులకు ఖరీఫ్ పంటపై ఆశలు చిగురించాయి. జూలై 23న పంపా ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. మొదట 30 క్యూసెక్కులు చొప్పున విడుదల చేశారు. తరువాత వంద క్యూసెక్కులకు పెంచారు. ప్రస్తుతం రైతాంగం ఖరీఫ్ పనుల్లో బిజీగా ఉండగా రిజర్వాయర్ బ్యారేజీ గేటు నుంచి నీరు వృథాగా పోతుండడం అశనిపాతంలా మారింది.
పుష్కరాలకు కార్యాచరణ
రాజమహేంద్రవరం రూరల్: గోదావరి పుష్కరాలు – 2027 నిర్వహిణకు పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళదామని కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో ఆమె వివిధ అంశాలపై చర్చించారు. ఆమె మాట్లాడుతూ గతంలో జరిగిన పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు సూచనలను సలహాలను పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకుంటా మన్నారు. శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసు మాట్లాడుతూ రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ రహదారులపై అవగాహనకు వచ్చానన్నారు. ఎస్పీ డి.నరసింహ కిషోర్ మాట్లాడుతూ ట్రాఫిక్ మళ్లింపు అంశాలపై ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment