
జల తాండవం
● జలాశయంలో గరిష్ట స్థాయికి
నీటి నిల్వలు
● రోజుకు 300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కోటనందూరు: తాండవ జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతూ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 380 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 375.5 అడుగులకు చేరింది. క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి రోజూ 300 క్యూసెక్కుల వరకూ ఇన్‌ఫ్లో వస్తుండడంతో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయని డీఈఈ అనురాధ తెలిపారు. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా నీటి నిల్వలు 378 అడుగులకు చేరిన తరువాత అదనపు జలాలను స్పిల్‌వే ద్వారా సముద్రానికి విడిచిపెడతామని వివరించారు. సముద్రానికి నీటిని విడిచిపెట్టాల్సి వస్తే రెవెన్యూ, పోలీసు శాఖలతో పాటు ఆయకట్టు రైతులకు సమాచారం ఇస్తామని తెలిపారు.
19న నీటి విడుదల
తాండవ జలాశయం నుంచి ఆయకట్టుకు ఈ నెల 19న ఉదయం 8 గంటలకు నీటిని విడుదల చేయుటకు నిర్ణయం తీసుకున్నామని ప్రాజెక్టు డీఈఈ పి.అనురాధ తెలిపారు. ఆ రోజు గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా నీటిని విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ విభాగం ముమ్మరంగా కాలువలపై పర్యటించి కాలువల స్థితిగతులను పరిశీలిస్తున్నామన్నారు. సాగునీరు వృథా పోకుండా శిథిలమైన కాలువ గట్ల మరమ్మతులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. రైతులంతా సమన్వయంతో సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment