
రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ కార్యవర్గంలో జిల్లాకు స్థానం
అమలాపురం టౌన్: రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్‌లో జిల్లాకు రెండు పదవులు దక్కాయి. రాష్ట్ర అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, రాష్ట్ర అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా జిల్లా అసోసియేషన్ కోశాధికారి దొమ్మేటి వెంకటరమణ ఎన్నికయ్యారు. వీరిద్దరూ అమలాపురానికి చెందిన వారే. దీనిపై అమలాపురంలో సోమవారం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నంలో ఆదివారం జరిగిన రాష్ట్ర అసోసియేషన్ ఎన్నికల్లో జిల్లాకు ప్రాధాన్యం ఇస్తూ కృష్ణ పద్మరాజు, వెంకటరమణలకు అవకాశం లభించారన్నారు. వీరి ఎన్నిక పట్ల జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు, అసోసియేషన్ ప్రతినిధులు నగభేరి కృష్ణమూర్తి, గారపాటి చంద్రశేఖర్, కత్తుల శ్రీనివాసరావు, మట్టపర్తి సముద్రం తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
ఎస్పీ కార్యాలయానికి
25 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు ఫిర్యాదులను స్వీకరించారు. రాయవరం మండలం పసలపూడికి చెందిన కొవ్వూరి లక్ష్మి తన తండ్రి కృష్ణ మృతికి కారణమైన బాధ్యులను శిక్షించాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అలాగే కొందరు ఫిర్యాదుదారులు కుటుంబ సమేతంగా వచ్చి తమ కుటుంబ తగాదాలను ఎస్పీకి చెప్పుకుని న్యాయం చేయాలని కోరారు. కొన్ని ఫిర్యాదులను ఎస్పీ అక్కడిక్కడే పరిష్కరించారు. అయితే మిగిలిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆయా ప్రాంతాల డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పర్యవేక్షణ ఎస్సై డి.శశాంక పాల్గొన్నారు.
తైక్వాండోలో
క్రీడాకారుల ప్రతిభ
అంబాజీపేట: స్థానిక శ్రీనివాస తైక్వాండో క్లబ్ విద్యార్థినులు పలు విభాగాల్లో మూడు గోల్డ్ మెడల్స్, సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించినట్లు కోచ్ పితాని త్రిమూర్తులు తెలిపారు. సోమవారం అంబాజీపేట జెడ్పీ హైస్కూల్‌లో విజేతలను అభినందించారు. ఈ నెల 11న కాకినాడ జిల్లా స్టేడియంలో 30వ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్స్, సీనియర్స్ తైక్వాండో చాంపియన్ షిప్ పోటీలు జరిగాయని త్రిమూర్తులు తెలిపారు. సీనియర్ విభాగంలో పితాని భార్గవి శ్రీకళ, కె.లక్ష్మీప్రసన్న గోల్డ్ మెడల్స్, కె.వినూత్న సిల్వర్ మెడల్, డి.రాఘవేంద్ర బ్రాంజ్ మెడల్ సాధించారన్నారు. జూనియర్ విభాగంలో ఎ.ఆదిత్య గోల్డ్, ఏబీ చైతన్య బ్రాంజ్ మెడల్ కై వసం చేసుకున్నారన్నారు. క్రీడాకారులను ఎస్సై కె.చిరంజీవి, హెచ్‌ఎం కె.సాయిరామ్, ఎస్‌ఎంసీ చైర్మన్ పితాని త్రిమూర్తులు, పీడీ కె.ఆదిలక్ష్మి, పీఈటీ అందె సూర్యకుమారి అభినందించారు.
వరలక్ష్మీ కానుక విజయవంతం
గోకవరం: హిందూ ధర్మ పరిరక్షణకు చేపట్టిన బంగారు వరలక్ష్మీ కానుక విజయవంతం అయ్యిందని విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్‌రావు వెల్లడించారు. గోకవరం సూర్యఫంక్షన్ హాలులో సోమవారం బంగారు వరలక్ష్మీ కానుక కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని మహిళలకు లక్కీడ్రా నిర్వహించి 133 మందికి బంగారు రూపులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 17 వేల మంది పేర్లు నమోదు చేశామన్నారు. వీరిలో లక్కీ డ్రా ద్వారా 440 మందికి గ్రాము బంగారు రూపుని అందించామన్నారు.

రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ కార్యవర్గంలో జిల్లాకు స్థానం

రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ కార్యవర్గంలో జిల్లాకు స్థానం

రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ కార్యవర్గంలో జిల్లాకు స్థానం
Comments
Please login to add a commentAdd a comment