
కొత్తపేటలో
నామినేషన్
వేస్తున్న
వైఎస్సార్ సీపీ
అభ్యర్థి
చిర్ల జగ్గిరెడ్డి
కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా చిర్ల జగ్గిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కొత్తపేట డివిజనల్ రెవెన్యూ కార్యాలయంలో ఆర్డీఓ, అసెంబ్లీ ఎన్నికల అధికారి జి.వి.వి.సత్యనారాయణకు నామినేషన్ సమర్పించారు. జగ్గిరెడ్డి నామినేషన్‌కు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు వేలాదిగా తరలిరావడంతో రావులపాలెం – కొత్తపేట రహదారి, కొత్తపేట రోడ్లు జనసంద్రంగా మారాయి. జగ్గిరెడ్డి గోపాలపురంలో తన స్వగృహం వద్ద నుంచి బయలుదేరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడకు రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. వారు వెంట ర్యాలీగా రాగా జగ్గిరెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ కొత్తపేట చేరుకుని నామినేషన్లు సమర్పించారు. జై జగన్... జై జగ్గిరెడ్డి అనే నినాదాలు హోరెత్తాయి. జగ్గిరెడ్డి వెంట అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి రాపాక వర ప్రసాద్ కూడా ఉన్నారు. జగ్గిరెడ్డితోపాటు ఆయన సతీమణి లావణ్య 2 సెట్ల నామినేషన్‌లు వేశారు.