
ఉపాధి లక్ష్యం ఉపవాసమా!
ప్రకటనలకే పరిమితం
పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేసేందుకు ఉపాధి పథకం దోహదపడు తుందంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న తీరుకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు తీవ్ర వ్యత్యాసం కనబడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు పది నెలలు పూర్తవుతున్నా సక్రమంగా చెల్లింపులు లేక గ్రామాల్లోని అభివృద్ధి ఎండమావిగా మారింది. ఉపాధి హామీ ద్వారా నిర్ణీత సమయానికి ఇప్పటి వరకూ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం, రైతులకు రాయితీలను అందించకపోవడం, ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లింపులపై దృష్టి సారించకపోవడంపై అంతటా అసహనం వ్యక్తమవుతోంది. అలాగే ఎన్‌ఆర్‌జీఈఎస్ ద్వారా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు బిల్లులు రాక అభివృద్ధి పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. జిల్లాలోని అనేక గ్రామాల్లో అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగిలిపోవడం ఈ పరిస్థితికి అద్దంపడుతోంది. జిల్లాలోని ఒక్కొక్క ఉపాధి కూలీ ఖాతాలో రూ.వేలల్లో వేతనాల జమ కావలసి ఉన్నా ఇప్పటి వరకూ పైసా కూడా ప్రభుత్వం మంజూరు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
● చేసిన పనులకు మంజూరు కాని బిల్లులు
● నాలుగు నెలలుగా కూలీలకు పస్తులు
● కమీషన్ల కక్కుర్తితో అనర్హులకు గోకులాలు
● గగ్గోలు పెడుతున్న కాంట్రాక్టర్లు
ఆలమూరు: పని లేనివారికి పని చూపించి నాలుగు డబ్బులు సంపాదించే అవకాశం కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలది. నిరుద్యోగితను పారదోలి ప్రతి వ్యక్తీ పనిచేయడం ద్వారా కొనుగోలు శక్తి పెరిగి రాష్ట్ర లేదా దేశ ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లు లేకుండా సాగిపోయేలా చూడాల్సిన అవసరం ప్రభుత్వ పెద్దలదే. చేసేందుకు పని లేక మూడంకె వేసి ఇంట్లో పడుకుంటే వ్యక్తికీ, వ్యవస్థకీ కూడా నష్టమే. ఈ క్రమంలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు పనికి ఆహార పథకం, ఉపాధి హామీ పథకం ఏదైనా సరే లక్ష్యం మాత్రం ప్రభుత్వానికి అవసరమైన పనీ జరగాలి.. అటు పని చేసిన వ్యక్తికి లబ్ధీ చేకూరాలి. పని చేయించేసుకుని మీ లబ్ధి తరవాత చూద్దాం అంటే లక్ష్యానికే విరుద్ధం. అదే జరుగుతోంది కూటమి ప్రభుత్వంలో. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పేరైతే గొప్పగా ఉంది కానీ ఉపాధిలోనే అర్ధ సత్యం కనిపిస్తోంది. ఎన్నికల హామీగా గొప్పలకు పోయి అది చేసేస్తాం.. ఇది చేసేస్తాం అని ప్రగల్భాలు పలికి పని చేసిన వారికి డబ్బులు ఇవ్వకపోవడం అన్నది శోచనీయం. అదికూడా ఒకటీ రెండూ కాదు ఏకంగా నాలుగు నెలల పాటు నిధులు పెండింగ్ పెట్టి పథకం లక్ష్యానికి విఘాతం కలిగిస్తోంది కూటమి ప్రభుత్వం.
గ్రామీణ ప్రాతాల అభివృద్ధికి, మౌలిక వసతుల ఏర్పాటుకు, కనీస సౌకర్యాల కల్పనకు అంత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామంటూ విస్తృత ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం ఆచరణలో చేతులెత్తిసింది. మహాత్మా గాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) ద్వారా చేపట్టిన సీసీ రోడ్లు, గోకులాలకు నిధుల మంజూరులో తీవ్ర జాప్యం ఏర్పడగా ఉపాఽధి కూలీలకు మూడు నెలల నుంచి వేతనాలు మంజూరు కావడం లేదు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన కొత్తలో గ్రామాల్లో ఆర్భాటంగా చేపట్టిన అభివృద్ధి పనులకు కొంతమేర బిల్లులు చెల్లించి ఏదో చేసేస్తున్నట్టు ఆర్భాటం చేసినా కొనసాగింపులో మాత్రం చతికిలబడ్డారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో అనేక చోట్ల అప్పులు తెచ్చి రోడ్లను నిర్మించిన చిన్న కాంట్రాక్టర్లకు నాలుగు నెలలుగా బిల్లులు రాక గగ్గోలు పెడుతున్నారు. ఆరుగాలం కష్టించి పనిచేసిన ఉపాధి కూలీలకు వేతనాలు అందక అర్ధాకలితో అలమటిస్తున్నారు. వేతనాలను మంజూరు చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకునే నాథుడు లేడంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కూలీల రోదనను, అకలి కేకలను ప్రభుత్వం పట్టించుకోదా అంటూ అధికారులను నిలదీస్తున్నారు.
అలాగే అధికారంలోకి రాగనే కూటమి నేతలు ఆగమేఘాల మీద ఎన్‌ఆర్‌ఈజీఎస్, పశుసంవర్ధకశాఖ అఽధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి అనర్హులకు, అనుయాయులకు నిర్మించిన గోకులాలు (పశువుల షెడ్లు)కు సంబంధించి ఆరు నెలలైనా బిల్లులు మంజూరు కాలేదు. బిల్లులు వెంటనే వస్తాయన్న హామీతోనే గోకులాలు పూర్తి చేశామని పాడిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది కూటమి నేతలు ఆయా గ్రామాల్లోని గోకులాల లబ్ధిదారుల వద్ద, కాంట్రాక్టర్ల వద్ద ముందుగానే కమీషన్ తీసుకోవడంతో వారు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. బిల్లులు వేగవంతంగా అందిస్తామన్న హామీతో అప్పులు చేసి మరీ పనులు చేస్తే నెలలు తరబడినా బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లబ్దిదారులు ఆవేదన చెందుతున్నారు. దీనికి తోడు కొంత మంది అధికార పార్టీ నేతలకు కూడా అడిగిందే తడవుగా కమీషన్లను కూడా ముట్టచెప్పామని ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకువచ్చి వేగంగా నిధులు తీసుకురావలసిన కూటమి ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నిర్లిప్తంగా వ్యవహరించడం కష్టజీవులకు శాపంగా పరిణమించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 22 మండలాల్లో 385 గ్రామాల్లో 2,31,116 జాబ్ కార్డులు ఉండగా అందులో 1.59 లక్షలు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 5.42 లక్షల మంది కూలీలు ప్రభుత్వం మంజూరు చేసిన 2385 పనులకు సంబంధించి 56,80.201 రోజులు పనిచేశారు. వీరందరికీ 2025 మార్చి 31 నాటికి ఎన్‌ఆర్‌ఈజీఎస్ విభాగం ద్వారా కూలీలకు రూ.18.72 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది.
జిల్లాలో ఉపాధి జాబ్ కార్డులు 2,31 లక్షలు
వాడుకలో ఉన్న కార్డులు 1.59 లక్షలు
పనుల్లో పాల్గొన్న కూలీలు 5.42 లక్షలు
జిల్లాలో కూలీల పనిదినాలు 56.80 లక్షలు
వేతన బకాయిలు రూ.18.72 కోట్లు
జిల్లాలో మంజూరైన గోకులాలు 1150
ఇప్పటి వరకూ నిర్మించినవి 880
మంజూరు చేయల్సిన నిధులు రూ 7.11 కోట్లు
జిల్లాలో నిర్మించిన సీసీ రోడ్లు 1098 కి.మీ
కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు 63.58 కోట్లు
నెలాఖరులోగా బిల్లులు చెల్లిస్తాం
ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఈ నెలాఖరులోగా బిల్లులు చెల్లిస్తాం. ఉపాధి కూలీల పెండింగ్ వేతనాల మంజూరుకు అన్ని చర్యలు చేపట్టాం. ఈనెల 25 లోపు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమచేస్తాం. పల్లె పండగలో నిర్మించిన నిర్మాణాలకు సంబంధించి బిల్లుల చెల్లింపు ప్రొసెస్‌లో ఉంది.
– ఎస్.మధుసూదన్, జిల్లా డ్వామా పీడీ, అమలాపురం

ఉపాధి లక్ష్యం ఉపవాసమా!

ఉపాధి లక్ష్యం ఉపవాసమా!

ఉపాధి లక్ష్యం ఉపవాసమా!