
కల్యాణోత్సవాల దిశగా అడుగులు
అన్నవరం: వచ్చే నెల 7 నుంచి 13వ తేదీ వరకూ జరగనున్న సత్యదేవుని వార్షిక కల్యాణ మహోత్సవాల ఏర్పాట్లు క్రమంగా జోరందుకుంటున్నాయి. ఇప్పటికే ఆలయానికి రంగులు వేసే పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 23న దేవస్థానం, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో చర్చించాల్సిన అంశాలపై దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, ఇతర అధికారులు ఆదివారం సమావేశమై చర్చించారు. కల్యాణోత్సవాలను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఇదిలా ఉండగా సత్యదేవుని కల్యాణోత్సవాలకు రావాడ చిరంజీవి దంపతులు (విజయవాడ) రూ.3.5 లక్షల విలువ చేసే పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే, స్వామివారి కల్యాణంలో ఉపయోగించేందుకు వి.రాము (జంగారెడ్డిగూడెం) గోటి తలంబ్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలు, తలంబ్రాలను చైర్మన్ రోహిత్, ఈఓ సుబ్బారావు దాతల నుంచి స్వీకరించారు. కార్యక్రమంలో వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, యనమండ్ర శర్మ, ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, ఏఈఓ కొండలరావు, సూపరింటెండెంట్లు అనకాపల్లి ప్రసాద్, సుబ్రహ్మణ్యం, అర్చకులు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
వైదిక కార్యక్రమాల నిలిపివేత
కల్యాణ మహోత్సవాల సందర్భంగా వచ్చే నెల 7 నుంచి 13వ తేదీ వరకూ సత్యదేవుని సన్నిధిలో నిత్యం నిర్వహించే పలు వైదిక కార్యక్రమాలను నిలిపివేయనున్నారు. నిత్య కల్యాణం, ఆయుష్య హోమం, సహస్ర దీపాలంకార సేవ, పంచ హారతుల సేవ, ప్రతి శుక్రవారం వనదుర్గ అమ్మవారికి జరిగే చండీహోమం, పౌర్ణమి నాడు జరిగే ప్రత్యంగిర హోమం, రాత్రి వేళల్లో జరిగే పవళింపు సేవ నిలుపుదల చేయనున్నారు. స్వామివారి వ్రతాలు, ఇతర కార్యక్రమాలు యథాతథంగా జరుగుతాయి.