సర్దుపాట్లు | - | Sakshi
Sakshi News home page

సర్దుపాట్లు

Published Wed, Aug 14 2024 8:16 AM | Last Updated on Wed, Aug 14 2024 8:16 AM

సర్దు

సర్దుపాట్లు

వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌కు

ప్రభుత్వం సన్నాహాలు

ఉపాధ్యాయుల అభ్యంతరం

రాయవరం: ఉపాధ్యాయుల సర్దుబాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సాధారణంగా ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయుల సర్దుబాట్లు చేయాలి. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచింది. మరో 10 రోజుల్లో ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలకు కూడా విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఈ దశలో ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్దుబాటుకు ఆదేశాలు ఇచ్చింది. వీటిపై ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోమవారం వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ చేస్తున్నామని, మిగులు ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌కు రావాలని మండల విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు సర్దుబాటు ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఈ ప్రక్రియకు దూరంగా నిలిచారు.

ఆందోళనలో టీచర్లు

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఇప్పుడు సర్దుబాటు బెంగ పట్టుకుంది. జీవో 117కు వ్యతిరేకంగా గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల విలీనంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నూతన విద్యా విధానంలో భాగంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య, దూరం ఆధారంగా ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతులను సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. అనంతరం ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేశారు. ఎన్నికలకు ఏడాది ముందు ఉపాధ్యాయ బదిలీలు కూడా చేపట్టారు.

అప్పట్లో వ్యతిరేకించిన టీడీపీ

విలీన ప్రక్రియను అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న ప్రస్తుత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అధికారంలోకి రాగానే 117 జీవోను రద్దు చేస్తామని కూడా ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ ప్రకటించింది. అయితే ఇప్పుడు 117 జీవోను రద్దు చేయకుండా, ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలని, విద్యా సంవత్సరం మధ్యలో సర్దుబాటు ప్రక్రియ చేపట్టడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు నష్టపోతుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టీఐఎస్‌లో సమాచారం

టీచర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌లో ఉపాధ్యాయుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా సర్దుబాట్లు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇటీవల కాలంలో పలు కారణాలతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఈ క్రమంలో చాలా పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిలో తేడా వచ్చింది. దీంతో ఉపాధ్యాయులు సర్దుబాటు కోసం ఫేషియల్‌ అటెండెన్స్‌ యాప్‌లో టీచర్ల వివరాలను నమోదు చేయించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా మిగులు ఉపాధ్యాయులను ఇప్పటికే గుర్తించారు. మరోవైపు పలు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నట్లుగా గుర్తించారు. సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చేందుకు మిగులు సెకండరీ గ్రేడ్‌ టీచర్ల(ఎస్‌జీటీ)లను వారి విద్యార్హత ఆధారంగా సబ్జెక్టు టీచర్లుగా పంపించాలని నిర్ణయించారు. మరోవైపు వచ్చే ఏడాది జనవరి నాటికి డీఎస్సీ నియామకాలు చేపడతామని ఇప్పటికే ప్రకటించారు. డీఎస్సీ 2024 నియామకాల అనంతరం తిరిగి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.

జూనియర్లకు ఎఫెక్ట్‌

మిగులు పోస్టుల నిర్దారణలో కేడర్‌(సర్వీస్‌) సీనియార్టీని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఒక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల్లో మిగులు టీచర్లు ఉన్పప్పుడు వారిలో జూనియర్లను మిగులు టీచర్లుగా నిర్దారిస్తారు. గతంలో సీనియర్‌ కోరుకుంటే వారిని సర్దుబాటు జాబితాలో చేర్చేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా కేవలం కేడర్‌ జూనియర్‌ను మాత్రమే సర్దుబాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ 14వ తేదీలోగా పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేశారు. మిగులు టీచర్లను నిర్ధారించి, మిగులు టీచర్లకు సోమవారం కౌన్సెలింగ్‌ చేయాలని నిర్ణయించారు.

వ్యతిరేకించిన ఉపాధ్యాయ సంఘాలు

మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. జీవో నంబరు 117, 128 ప్రకారం సర్దుబాటు ప్రక్రియను చేపడుతున్నారు. 117 జీవోనే రద్దు చేయమని డిమాండ్‌ చేస్తున్నప్పుడు ఆ జీవోను ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయుల సర్దుబాటు ఏ విధంగా చేస్తారనేది ఉపాధ్యాయ సంఘాల ప్రధాన డిమాండ్‌గా ఉంది. ముందుగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం సోమ, మంగళవారాల్లో మిగులు టీచర్ల సర్దుబాటు చేయాల్సి ఉండగా, సోమవారం ఫాఫ్టో, జాక్టో అసోసియేషన్ల ఆధ్వర్యంలో సర్దుబాటు ప్రక్రియను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన సర్దుబాటు ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేశారు. జీవో నంబరు 117, 128 ప్రకాారం కాకుండా జీవో 53 ప్రకారం చేయాలని ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మండల స్థాయిలోనే కౌన్సెలింగ్‌

మండల స్థాయి ప్రాతిపదికగానే వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ చేపట్టాలి. మండల స్థాయిలో పాఠశాలల్లో వాస్తవంగా ఉన్న విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలి. జీవో 53 ప్రకారం వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ చేపట్టాలి.

– చింతాడ ప్రదీప్‌ కుమార్‌,

పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ

117 జీవో రద్దు చేయాలి

ఉపాధ్యాయుల సర్దుబాటుకు ముందుగా జీవో 117ను రద్దు చేయాలి. దానిని రద్దు చేస్తానంటూ ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి. అసంబద్ధంగా ఉన్న జీవో ప్రకారం ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం వల్ల విద్యావ్యవస్థకు నష్టం జరుగుతుంది.

– పెంకే వెంకటేశ్వరరావు, యూటీఎఫ్‌ జిల్లా

అధ్యక్షుడు, అమలాపురం,

ప్రభుత్వ నిర్ణయం అసంబద్ధం

ఉపాధ్యాయుల సర్దుబాటును 117, 128 జీవోల ప్రకా రం చేప ట్డం అన్యాయం. ఈ నిర్ణయం పూర్తి అసంబద్ధంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్పప్పుడు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్‌ స్వయంగా జీవో 117 రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తయినప్పటికీ జీవో రద్దుకు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించక పోవడం శోఛనీయం.

– పొతంశెట్టి దొరబాబు,

ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు, అమలాపురం

ఉపాధ్యాయ సంఘాల ప్రధాన డిమాండ్లు

జీవో నంబరు 53 ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలి.

మండల పరిధిలోనే సర్దుబాట్లు ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో డివిజన్‌ స్థాయిలో చేపట్టాలి. జిల్లాల దాటి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయరాదు.

ప్రస్తుత అకడమిక్‌ విద్యా సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేస్తున్నవారిని సర్దుబాటు నుంచి మినహాయించాలి.

ఫ్లస్‌–2, సీబీఎస్‌ఈ అమలవుతున్న పాఠశాలల్లో వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ చేయరాదు. స్టడీ లీవ్‌, మెటర్నటీ లీవ్‌లో ఉన్న ఉపాధ్యాయులు ఉన్న చోట వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి.

పీఎస్‌ హెచ్‌ఎంను అదే పాఠశాలలో ఉన్న రోల్‌తో సంబంధం లేకుండా కొనసాగించాలి.

6 నుంచి 10 తరగతులు ఉన్న పాఠశాలల్లో 10 సెక్షన్లు దాటితే రెండవ హిందీ, రెండవ పీఎస్‌ పోస్టు మంజూరు చేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
సర్దుపాట్లు1
1/3

సర్దుపాట్లు

సర్దుపాట్లు2
2/3

సర్దుపాట్లు

సర్దుపాట్లు3
3/3

సర్దుపాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement