
నేటి నుంచి వాడపల్లిలో పవిత్రోత్సవాలు
● మూడు రోజుల పాటు నిర్వహణ
● ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు
ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు బుధవారం ఉదయం నుంచి ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవదాయ ధర్మదాయశాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ భూపతిరాజు కిషోర్‌కుమార్ తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజులు పాటు ఆలయంలో అష్టోత్తర పూజలు, కల్యాణాలు, ఉపనయనాలు, వివాహాలను రద్దు చేశామన్నారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. వివిధ రకాల పుష్పాలు, పువ్వులతో ముస్తాబు చేస్తున్నారు.
కార్యక్రమాల వివరాలు
పవిత్రోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 8 గంటలకు విష్వక్ష్సేన పూజ, పుణ్యహవచనం, సాయంత్రం 5 గంటలకు సంకల్పం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, గురువారం ఉదయం 8 గంటలకు సంకల్పం, విష్వక్ష్సేన పూజ, పుణ్యహవచనం, సాయంత్రం 5 గంటలకు పవిత్రారోహణం, విశేష అర్చన, పవిత్ర ప్రతిష్ట ప్రధాన హోమాలు, 16వ తేదీ ఉదయం 8 గంటలకు సంకల్పం, మహా శాంతిహోమం, ప్రాయశ్చిత్ర హోమం, మహాపూర్ణహుతి, పవిత్ర విసర్జన, మహదాశీర్వచనం నిర్వహించనున్నారు.