
బధిర క్రీడాకారుడికి చేయూతనివ్వండి
పిఠాపురం: ఆసియా, పసిఫిక్ బధిర బాస్కెట్ బాల్ చాంపియన్‌షిప్‌నకు భారత దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మిడి ఏసు కుమార్‌కు ఆర్థిక సాయం అందించి ఆ పోటీలో పాల్గొనే అవకాశం కల్పించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొజ్జా మాణిక్యాలరావు దాతలను కోరుతున్నారు. ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ డెఫ్ (డీఐబీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలు ఆస్ట్రేలియా దేశం మెల్‌బోర్న్‌లో ఈ ఏడాది సెప్టెంబర్ 12 నుంచి 29 వరకూ జరుగుతాయని, ఇంత మంచి అవకాశాన్ని దక్కించుకున్న ఏసుకుమార్ పిఠాపురానికి గర్వకారణమన్నారు. దేశ వ్యాప్తంగా 12 మందికి అవకాశం రాగా, తెలుగురాష్ట్రాల నుంచి అతనొక్కడే ఎంపికయ్యారని ఆయన అన్నారు. పోటీలకు వెళ్లి వచ్చేందుకు అయ్యే ఖర్చును క్రీడాకారులే భరించాలని ఆల్ ఇండియా స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ డఫ్ షరతు విధించిందని, అక్కడకు వెళ్లేందుకు రూ.2.06 లక్షల ఖర్చవుతుందని ఆ మొత్తాన్ని భరించే స్థితి అతని కుటుంబానికి లేదని మాణిక్యాలరావు పేర్కొన్నారు. తండ్రి సుబ్బారావు మరణం తర్వాత తల్లి వెంకట లక్ష్మితో కుమార్ వెల్డింగ్ షాపులో పనిచేస్తూ ఆమెకు ఆసరాగా ఉన్నాడన్నారు. స్థానిక రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ బాస్కెట్ బాల్ కోర్టులో శిక్షణ పొందిన ఏసు కుమార్ అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపాడన్నారు. దాతలు ఉమ్మిడి వెంకట లక్ష్మి ఆకౌంట్ నెంబర్ 043210100139503, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఠాపురం బ్రాంచ్ ఐఎఫ్‌ఎస్‌ఈ కోడ్ యూబీఐ 804321కు కానీ, ఉమ్మిడి ఏసు కుమార్ ఫోన్ పే నెంబర్ 9347199153 సాయం చేయవచ్చని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment