
గంటాలమ్మ మృతదేహం
కొత్తపేట: పెళ్లి చేసుకుని ఆనందంగా కాపురానికి వెళ్లిన ఆమె తన భర్త అనుమానపు జబ్బును చూసి బెంబేలెత్తిపోయింది. ఏదోలా రాజీపడి బతుకుతున్నా భర్త వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేకపోయింది. తల్లి లేని ఆమె తన అమ్మమ్మ ఇంటికి ఇద్దరు కుమారులతో కలిసి వచ్చేసింది. అయితే కోపం పెంచుకున్న భర్త ఆ అమ్మమ్మను దారుణంగా హత్య చేశాడు. మండలంలోని గంటి గ్రామంలో శిరిగినీడి గంటాలమ్మ (78) హత్య కలకలం రేపింది. ఎస్సై ఎం.అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. గంటాలమ్మ మనవరాలు (కూతురి కుమార్తె) నాగదేవికి సుమారు 9 ఏళ్ల క్రితం తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన సాదం రామకృష్ణతో వివాహం జరిగింది. కొంత కాలం వీరి సంసారం సజావుగా సాగింది. అనంతరం భార్యపై అనుమానంతో రామకృష్ణ తరచూ గొడవలు పడేవాడు. ఆ క్రమంలో తన తమ్ముడి నరేష్‌తో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో అతడిని గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ కేసులో అరైస్టెన రామకృష్ణ కొన్నేళ్ల క్రితం జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో భార్యాభర్తలు రాజీపడ్డారు. భార్య కోరిక మేరకు ఆలమూరు మండలం చెముడులంకలో కాపురం ప్రారంభించారు. కానీ రామకృష్ణ అనుమానంతో మళ్లీ నాగదేవిని చిత్రహింసలకు గురిచేశాడు. అవి భరించలేని నాగదేవి తన ఇద్దరు కుమారులతో గంటిలో అమ్మమ్మ గంటాలమ్మ ఇంటికి వచ్చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో తన భార్యను కాపురానికి పంపించాలని గంటాలమ్మతో రామకృష్ణ ఘర్షణ పడ్డాడు. ఆమైపె దాడి చేసి, ఇంటిలో వస్తువులు చెల్లాచెదురుచేసి, చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో నాగదేవి కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, రామకృష్ణను అరెస్టు చేశారు. స్థానిక సబ్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన రామకృష్ణ బుధవారం తెల్లవారుజామున గంటాలమ్మ ఇంట్లోకి ప్రవేశించాడు. హాల్లో నిద్రిస్తున్న గంటాలమ్మ పీకను కత్తితో కోసేశాడు. ముఖం, భుజంపై విచక్షణారహితంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అమ్మమ్మ కేకలకు పక్క గదిలో పిల్లలతో కలిసి నిద్రిస్తున్న నాగదేవి భయంతో తలుపులు వేసుకుని దాక్కుంది. రామకృష్ణ వెళుతూ ఏదోరోజు నిన్ను కూడా చంపేస్తానని భార్య ను బెదిరించాడు. సమాచారం అందుకున్న రావులపాలెం సీఐ రామ్‌కుమార్, ఎస్సై ఎం.అశోక్ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నాగదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అశోక్ తెలిపారు.
నిద్రిస్తుండగా పీక కోసి చంపిన
మనవరాలి భర్త
కుటుంబ కలహాలతో ఘాతుకం