బాలబాలాజీ దర్శనానికి
పోటెత్తిన భక్తులు
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి దర్శనానికి శనివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. విశేష సంఖ్యలో వచ్చిన భక్తులు పవిత్ర వైనతేయ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. సుప్రభాత సేవ అనంతరం, తొలి హారతి కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా స్వామి వారికి రూ.3,57,034 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.56,835 వచ్చిందని, నిత్యాన్నదానం ట్రస్టుకు రూ.81,911 విరాళాలు వచ్చాయని వివరించారు. మొత్తం 5,500 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని, 3 వేల మంది అన్నప్రసాదం స్వీకరించారని వివరించారు. కాగా, నిత్యాన్నదాన ట్రస్టుకు ఆకుల స్వామినాయుడు, పద్మ దంపతులు (పాశర్లపూడి) రూ.30,044, శివ పరంశెట్టి కుటుంబ సభ్యులు (హైదరాబాద్) రూ.11,116 చొప్పున విరాళాలు సమర్పించారు.
వేట నిషేధ భృతి పంపిణీ
అమలాపురం రూరల్: మత్స్యకార సేవ పథకం కింద జిల్లాలో అర్హులైన 11,123 మంది లబ్ధిదారుల ఖాతాలకు రూ.20 వేల చొప్పున వేట నిషేధ భృతి కింద రూ.22.24 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాట్రేనికోన మండలంలో 5,583 మంది, మామిడికుదురులో 2,070, ఐ.పోలవరంలో 1,393, సఖినేటిపల్లిలో 1,356, అల్లవరంలో 704, ఉప్పలగుప్తం మండలంలో 17 మంది చొప్పున మత్స్యకార లబ్ధిదారులకు ఈ భృతి అందజేశామని వివరించారు. కార్యక్రమంలో ముమ్మిడివరం, అమలాపురం ఎమ్మెల్యేలు దాట్ల సుబ్బరాజు, అయితాబత్తుల ఆనందరావు, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఆర్‌డీఓ కె.మాధవి, మత్స్యశాఖ జేడీ పీవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


