
రేషన్ బియ్యం పట్టివేత
పిఠాపురం: మండలంలోని బి.ప్రత్తిపాడు గ్రామంలో మంగళవారం పీడీఎస్ బియ్యం (రేషన్ బియ్యం) పట్టుకున్నట్లు రీజనల్ విజిలెన్స్ ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి తెలిపారు. పక్కా సమాచారం మేరకు గ్రామంలో తనిఖీలు నిర్వహించగా ఒక వాహనంలో 58 బస్తాల్లో ఉంచిన 3,150 కేజీల బియ్యాన్ని గుర్తించామన్నారు. దీనిని అక్రమంగా తరలిస్తున్న ఆకుల గంగరాజుపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సీజ్ చేసిన బియ్యం, వాహనం విలువ రూ.8,93,325 ఉంటుందన్నారు. తనిఖీలో విజిలెన్స్ ఎస్పై టి.జగనాథరెడ్డి, పిఠాపురం సీఎస్‌డీటీ వీరాస్వామి, కానిస్టేబుళ్లు లోవరాజు, శివ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
16 నుంచి వెదురుపాక పీఠం వార్షికోత్సవాలు
రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గాపీఠం 52వ వార్షికోత్సవాన్ని ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకూ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు మంగళవారం పీఠంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వాడ్రేవు వెంకట సు బ్రహ్మణ్యం (గాడ్) 1972లో ఈ పీఠం ఏర్పాటు చేసినప్పటికీ నుంచి ఏటా వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 16వ తేదీ ఉదయం 9.18 గంటలకు జ్యోతిప్రజ్వలనతో వార్షికోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా విజయదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజ లు, నవగ్రహ మండపారాధన నిర్వహిస్తారు. కొల్హాపూర్ వేదపండితులతో శ్రీమహాలక్ష్మి అమ్మవారికి తిరుమంజనం అర్చన, హోమం, సాయంత్రం 6.30 గంటలకు తమిళనాడు తిరుత్తణి ఆలయ అర్చకులతో సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి కల్యాణం జరుగుతాయి. 17వ తేదీ ఉదయం అహోబిలం వేద పండితులతో లక్ష్మీనరసింహస్వామికి తిరుమంజనం, అర్చన అనంతరం హోమం, సాయంత్రం పీఠంలోని అనంతలక్ష్మి సమేత వీర వేంకట సత్యనారాయణస్వామి కల్యాణం నిర్వహిస్తారు. 18న సీతారామ పట్టాభిషేకం, సాయంత్రం వైఖానస పండితులతో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణం జరుగుతుంది. విలేకరుల సమావేశంలో విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు భాస్కర నారాయణ, జి. సత్య వెంకట కామేశ్వరి, పి.సత్య కనకదుర్గ, బి. రమ, పీఠం పీఆర్వో వి.వేణుగోపాల్‌పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment