
అమలాపురంలో ఐఎంఏ వైద్యుల నిరసన
కోల్‌కతాలో వైద్యురాలి హత్యపై ఖండన
అమలాపురం టౌన్: కోల్‌కతాలో వైద్యురాలిపై లైంగిక దాడి, ఆపై హత్య చేసిన ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన తెలిపారు. శనివారం జిల్లాలోని వైద్యులు తమ విధులను బహిష్కరించి అమలాపురంలో నిరసన ప్రదర్శన చేశారు. స్థానిక గడియార స్తంభం సెంటర్‌కు జిల్లా నలుమూలల నుంచి వైద్యులు చేరుకుని కోల్‌కతా ఘటనను తీవ్రంగా ఖండించారు. వైద్యురాలిపై ఆటవికంగా లైంగిక చేసి, అతి కిరాతంగా హత్య చేసిన తీరుపై ఐఎంఏ వైద్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో దోషులను తక్షణమే శిక్షించాలని నినాదాలు చేశారు. తొలుత గడియార స్తంభం సెంటర్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత ధర్నా నిర్వహించారు. అక్కడి నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్ వరకూ చేరుకున్నారు. కలెక్టరేట్‌కు ఎదురుగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వైద్యులు పూలమాలలు వేశారు. అనంతరం కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్‌ను కలసి ఇటీవల కాలంలో వైద్యులపై పెరుగుతున్న దాడులను వివరించారు. దాడులు అరికట్టకపోతే తాము వైద్య సేవలు అందించలేమని వివరించారు. ఐఎంఏ జిల్లా శాఖ అధ్యక్షుడు వీఎస్‌ఎస్‌ఎన్ మూర్తి, కార్యదర్శి డాక్టర్ కడలి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో వైద్యులు పీఎస్ శర్మ, గొలకోటి రంగారావు, బి.రాఘవేంద్రరావు, జి.ప్రభాకర్, పయ్యావుల సురేష్, గిరిజా, రమాదేవి, దీపిక తదితరులు పాల్గొన్నారు. వైద్యుల నిరసన శిబిరాన్ని పట్టణ సీఐ కె.క్రిష్టోఫర్ సందర్శించారు. వైద్యులపై జరుగుతున్న దాడులపై చట్ట ప్రకారం తీసుకునే చర్యలను ఆయన వివరించారు. నిరసన ప్రదర్శన అనంతరం స్థానిక గడియారం స్తంభం సెంటర్‌లో దాడుల నుంచి వైద్యులు ఎలా రక్షణ పొందాలి, దాడులకు పాల్పడే వ్యక్తులను చట్టప్రకారం శిక్షించే అంశాలపై ఐఎంఏ వైద్యులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment