
తోడుగా.. రక్షగా..
ఫ అప్యాయతకు ప్రతీక రక్షాబంధన్
ఫ తోబుట్టువుల అనురాగాలకు సూచిక
ఫ రేపు రాఖీ పండగ
రాయవరం: కష్టాల్లో తోడూనీడగా... అనుబంధానికి ప్రతిరూపంగా.. యోగక్షేమాలు తెలుసుకుంటూ.. ఆప్యాయత పంచుతూ.. తోబుట్టువుల బంధాన్ని శాశ్వతంగా నిలిపేదే రక్షాబంధన్. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ఆత్మీయతకు నిర్వచనమే రాఖీ పండగ. ఇది సోదరి, సోదరుని మధ్యన ప్రేమానుబంధానికి ప్రతీక. ఈ నెల 19వ తేదీ సోమవారం శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమి తిథి కావడంతో రాఖీ పౌర్ణమిని తోబుట్టువులు ఆనందోత్సాహాలతో జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. పండగ రోజు పుట్టిళ్లు సందడిగా మారనున్నాయి. అక్కాచెల్లెళ్లు కట్టిన రాఖీలతో సోదరుల చేతులు వివిధ రంగులు, డిజైన్ల రాఖీలతో కళకళలాడనున్నాయి. అండగా ఉంటామని హామీ ఇస్తూ అన్నదమ్ములు తమకు తోచిన కానుకలు సోదరీమణులకు ఇస్తారు. రక్షా బంధన్‌ను రాఖీ పౌర్ణమి.. జంధ్యాల పౌర్ణమిగా పిలుస్తారు. విద్యార్థినీ విద్యార్థులు, యువతీ యువకుల మధ్య సోదరభావం, నైతిక విలువలు పెరిగేందుకు ఇది దోహపడుతోంది. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్ పెరుగుతున్న పరిస్థితుల్లో కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు ఈ పండగను ఘనంగా నిర్వహించేందుకు చొరవ చూపాలి.
మహాలక్ష్మి స్వరూపంగా..
ఆడ పడుచును మహాలకి్‌ష్మ్ స్వరూపంగా, పరాశక్తికి ప్రతీకగా భావించే సంస్కృతి మనది. కష్ట సుఖాల్లో భరోసాను అక్కాచెల్లెళ్లకు కల్పించడమే రాఖీ బంధం. సోమవారం జిల్లా వ్యాప్తంగా రాఖీ పౌర్ణమిని ఘనంగా నిర్వహించుకొనేందుకు సోదర సోదరీమణులు సన్నద్ధమవుతున్నారు. శ్రావణమాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పర్వదినాన్ని జంధ్యాల పౌర్ణమిగా పిలుస్తుంటారు. తమిళనాడులో పూనూల్‌పర్వగా, కేరళలో ఆవని ఆవిట్టంగా పిలుస్తుంటారు. ఉత్తరాదిలో రక్షాబంధన్‌గా పిలవడం పరిపాటి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం (ఓంశాంతి) ప్రతినిధులు రాఖీ పండగను ఆధ్యాత్మిక విశిష్టతగలదిగా భావిస్తారు. తమ కార్యాలయాల్లో ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ ప్రముఖులతో పాటు ఇతర రంగాల ప్రముఖులకు కూడా పండగ రోజు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టడం ఆనవాయితీగా వస్తోంది.
మార్కెట్‌లో కళకళ
రాఖీ పండగను పురస్కరించుకుని మార్కెట్‌లోని పలు ఫ్యాన్సీ షాపుల్లో సంప్రదాయ, ఆధునిక రాఖీలు కనువిందు చేస్తున్నాయి. వ్యాపారులు రంగురంగుల రాఖీలను అమ్మకాలకు పెట్టారు. ముఖ్యంగా పిల్లలను ఆకర్షించే వివిధ కామిక్ రాఖీలను ఎక్కువగా విక్రయిస్తున్నారు. మరికొన్ని బంగారు బ్రాస్‌లెట్‌లను తలపిస్తూ ధగధగలాడుతున్నాయి. రుద్రాక్ష, ప్లాస్టిక్, పూల రాఖీలు, రంగు పూసల రాఖీలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఇవి కాలానుగుణంగా కొత్త డిజైన్లలో వస్తున్నాయి. గతంతో పోల్చితే విక్రయాలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. రూ.10 నుంచి రూ.వేల ధరల్లో లభ్యమవుతున్నాయి.
అన్నంటే ప్రాణం
నాకు సొంత అన్నయ్యలు లేరు. నా కజిన్స్ అంతకంటే ఎక్కువగా భావిస్తాను. ఏటా మా అన్నకు రాఖీ కడతాను. ఎంత దూరాన ఉన్నా మా అన్న నా దగ్గరకు వచ్చి రాఖీ కట్టించుకొని వెళ్తాడు. అన్ని పండగల్లో అన్నాచెల్లెల గురించి తెలియజేసే పండగ ఇదే. ఎంత వయసు వచ్చినా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఏదీ సాటిరాదు.
–ఆర్.కృష్ణమాధురి,
మండల లెవిల్ అకౌంటెంట్, విద్యాశాఖ
కార్యాలయం, మండపేట
కష్ట సుఖాల్లో తోడుండేవాడే..
కష్ట సుఖాల్లో తోడుగా నిలిచి, మన శ్రేయస్సు కోరుకునే వారే సోదరులు. నా అన్నయ్యలు ఎప్పుడూ నాకు వెన్నంటే నిలిచారు. రాఖీ పండగ వస్తుందంటే నా కంటే ఎక్కువగా అన్నయ్యలు సంతోషపడతారు. ఎంతదూరాన ఉన్నా రాఖీ పండగకు తప్పనిసరిగా ఇంటికి వచ్చి ఆశీర్వదించి వెళ్తారు. వారి ప్రేమాభిమానాలు ఎప్పటికీ నిలిచి ఉండాలని కోరుకుంటాను.
–షేక్ కరీమున్నీసా బేగం,
పసలపూడి,
రాయవరం మండలం
ఆన్‌లైన్‌లో కానుకలు
కాలం మారడంతో పాటు రక్షా బంధన్ తీరు మారింది. విద్య, ఉపాధి, ఇతరత్రా కారణాలతో దూర ప్రాంతాల్లో ఉంటున్న సోదరులకు పోస్టు ద్వారా రాఖీలను పంపితే వాటిని కట్టుకొని తోబుట్టువులకు కానుకలు పంపే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరస్పరం అభినందనలు తెలుపుకొంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. పద్ధతులు మారినా రాఖీ అనుబంధం, ఆప్యాయత మాత్రం చెక్కు చెదరలేదు.

తోడుగా.. రక్షగా..

తోడుగా.. రక్షగా..

తోడుగా.. రక్షగా..

తోడుగా.. రక్షగా..

తోడుగా.. రక్షగా..
Comments
Please login to add a commentAdd a comment