
ఆరగించేందుకు అన్నలా..
● అన్న కేంటీన్ల ముసుగులో దోపిడీ
● మరమ్మతుల పేరిట మింగేసి..
సాక్షి, అమలాపురం: ఆరగించేందుకు కొత్త పథకం తెచ్చారు.. పేదలకు బువ్వ అంటూ రూ.లక్షలు బొక్కేసేందుకు తెరలేపారు.. కూటమి ప్రభుత్వంలో మొదలైన అన్న క్యాంటీన్లు పేదల కడుపు నింపకున్నా ముందే టీడీపీ ఆస్తాన కాంట్రాక్టర్ల జేబులు మాత్రం నింపుతున్నాయి. గతంలో ఉన్న అన్న క్యాంటీన్ భవనాలకు చేపట్టిన చిన్న చిన్న మరమ్మతులకు రూ.లక్షలకు లక్షలు కేటాయించుకున్నారు. ఇక కొత్తగా నిర్మిస్తున్న భవనానికి సైతం కేటాయించిన నిధులు చూసి సామాన్యులను ముక్కున వేలేసుకుంటున్నారు.
జిల్లాలో అమలాపురం గ్రేడ్–1 మున్సిపాలిటీతో పాటు మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధుల్లో సుమారు లక్ష మందికి పైగా జనాభా ఉంటారని అంచనా. 2014–19 టీడీపీ పాలనలో రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీల్లో అన్న క్యాంటీన్లను నిర్వహించేవారు. అమలాపురంలో ఏర్పాటు చేయలేదు. అప్పట్లో ఎంపిక చేసిన స్థలం కోర్టు వివాదంలో ఉండడం వల్ల ఇక్కడ నిర్వహించలేదు. ఇప్పుడు రామచంద్రపురం, మండపేటల్లో మరమ్మతులు చేపట్టి శుక్రవారం ప్రారంభించారు. అమలాపురం మున్సిపాలిటీలో కొత్త భవన నిర్మాణం చేపట్టారు. మండపేట మున్సిపాలిటీ పరిధిలో మరమ్మతులకు ఏకంగా రూ.13.85 లక్షలు ఖర్చు చేశారు. భవనంలో లోపల, వెలుపుల చిన్న చిన్న పనులు చేయడంతోపాటు కొత్త హంగులు చేశారు. కాంపౌండ్ వాల్ చుట్టూ దెబ్బతిన్న ఫ్లోరింగ్ చేయడంతో పాటు ఫ్రంట్ ఎలివేషన్ చేశారు. అయితే వీటికి ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్థానికులు చెబుతున్నారు. అలాగే రామచంద్రపురం మున్సిపాలిటీలో గతంలో ఉన్న అన్న క్యాంటీన్‌కు రూ.9.71 లక్షలతో మరమ్మతులు నిర్వహించారు. ఇంత ఖర్చు పెట్టి చేసే మరమ్మతులు ఏమున్నాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. భవనానికి ఎల్లో బోర్డులు, గ్లాస్‌లు వేయడంతో పాటు ఫ్లోరింగ్ చేశారు.
ఎందుకంత ఖర్చో!
అమలాపురం మున్సిపాలిటీలో అన్న క్యాంటీన్‌కు కొత్త భవన నిర్మాణం చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలోనే దీని నిర్మాణం జరుగుతోంది. ఇందుకు రూ.45 లక్షలు వెచ్చిస్తున్నారు. వాస్తవంగా దీని నిర్మాణానికి ఇంత ఖర్చు కాదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ భవనం పునాదుల దశలో ఉంది.

ఆరగించేందుకు అన్నలా..
Comments
Please login to add a commentAdd a comment