
సైబర్ నేరాలతో జాగ్రత్త
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్,
ప్రిన్సిపల్ జిల్లా జడ్జి సునీత
రాజానగరం: అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ హితంగా వాడుకోవలసి ఉండగా, కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థానికి వాడుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి సునీత గంధం అన్నారు. ఈ సమయంలో యువత అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరాలను అదుపు చేయడంలో కీలకపాత్ర వహించాలని సూచించారు. స్థానిక గోదావరి గ్లోబర్ యూనివర్సిటీలో ‘డ్రగ్స్ దుర్వినియోగం – యాంటీ ర్యాగింగ్’ అనే అంశంపై ఇంజినీరింగ్ విద్యార్థులకు మంగళవారం చైతన్య సదస్సు నిర్వహించారు. కళాశాలలు, యూనివర్సిటీలలో సీనియర్లు, జూనియర్లను వేధింపులకు గురిచేసి ర్యాగింగ్‌కి పాల్పడం తీవ్రమైన నేరంగా పేర్కొన్నారు. ఈ సమయంలో అటువంటి వారిపై విధించే కేసులు, చట్టాల గురించి అవగాహన కలిగించారు. సీనియర్లు ఎల్లప్పుడూ జూనియర్లకు తమ విజ్ఞానాన్ని పంచుతూ మార్గదర్శకులుగా ఉండాలిగాని, శత్రువుల్లా మారకూడదన్నారు. ఈ విధంగా చేస్తే ర్యాంగింగ్‌కి పాల్పడిన వ్యక్తుల జీవితాలు నాశనమవుతాయని హెచ్చరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రకాశ్‌బాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు ఏ ఒక్కరూ బానిసలు కావొద్దన్నారు. అదనపు ఎస్పీ ఎస్‌ఆర్ రాజశేఖరరాజు మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ఏవిధంగా మోసాలకు పాల్పడుతున్నారో వివరించారు. కార్యక్రమంలో జీజీయూ రిజిస్టార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.జయానంద్‌కుమార్, డాక్టర్ ఎస్‌వీఎస్‌ఎన్ మూర్తి, రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తేతలి రామారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.