ఎస్పీ కార్యాలయానికి 18 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 18 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదు చేశారు. వచ్చిన అర్జీల్లో కొన్నింటిని ఎస్పీ అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. మిగిలిన ఫిర్యాదులపై ఆయా పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలతో మాట్లాడి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదుదారులు కొందరు తమ కుటుంబ సమేతంగా వచ్చి కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలపై ఎస్పీకి ఏకరవు పెట్టారు. ఎస్పీ కార్యాలయ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పర్యవేక్షణ ఎస్సై డి.శశాంక పాల్గొన్నారు.
జగన్ కోసం నిలబడే వారు లక్షల్లో..
అమలాపురం టౌన్: మేము గేట్లు తెరిస్తే జగన్ మాత్రమే నిలుస్తారన్న రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు తోరం గౌతమ్ రాజా ఖండించారు. ఈ మేరకు అమలాపురంలో గౌతమ్ రాజా సోమవారం ప్రకటన విడుదల చేశారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారిపోయే ప్రతి ఒక్కరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మామూలేనని ఆయన మంత్రి విమర్శలను కొట్టి పారేశారు. మాజీ ముఖ్యమంత్రి జగనన్న వెంట నిలబడే నాయకులు, కార్యకర్తలు లక్షల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఈవీఎంల గోల్‌మాల్‌తో నెగ్గిన మీకు మా అధినేత జగన్‌ను విమర్శించే అర్హత లేదని పేర్కొన్నారు.
తోబుట్టువుల బంధాన్ని తెలిపేలా రాఖీ
అమలాపురం టౌన్: తోబుట్టువుల బంధాన్ని తెలుపేలా జిల్లాలో రక్షాబంధన్ వేడుకలను జరుపుకొన్నారు. చెల్లి అన్నకు, అక్క తమ్ముడికి రాఖీ కట్టి పండగ విశిష్టతను చాటారు. రాఖీ పౌర్ణమిని అమలాపురంలోని ఓం శాంతి కేంద్రం ఇన్‌చార్జి బ్రహ్మకుమారి శ్రీదేవి ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీలు ఘనంగా జరుపుకొన్నారు. అమలాపురంలోని రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి వి.నరేష్ వద్దకు బ్రహ్మకుమారీలు వెళ్లి రాఖీ కట్టారు. అలాగే జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఎంపీ గంటి హరీష్‌మాధుర్‌ల వద్దకు కూడా వెళ్లి రాఖీలు కట్టారు. బ్రహ్మకుమారీలు వారి నుదుట తిలకం దిద్ది స్వీట్లు తినిపించి ఆత్మీయతను చాటారు. ఓం శాంతి కేంద్రం ఇన్‌చార్జి బ్రహ్మకుమారి శ్రీదేవితోపాటు బ్రహ్మకుమారి స్వరూప తదితరులు పాల్గొన్నారు.
పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
అమలాపురం రూరల్: జిల్లా పరిధిలోని వన్ స్టాప్ సెంటర్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసేందుకు వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి ఝన్సీరాణి తెలిపారు. ఈ పోస్టులను కలెక్టర్ మహేష్‌కు మార్ అధ్యక్షతన భర్తీ చేస్తారన్నారు. 25–42 ఏళ్ల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సన్, లాయర్, పారా మెడికల్ పర్సన్, సోషల్ కౌన్సెలర్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఆఫీస్ అసిస్టెంట్, బహుళ ప్రయోజన సిబ్బంది, కుక్, సెక్యూరిటీ గార్డ్ తదితర పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. కోనసీమ ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని ఈ నెల 30వ తేదీలోగా ముమ్మిడివరంలో ఎయిమ్స్ కళాశాలలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయంలో అందించాలన్నారు.
కనక దుర్గమ్మకు లక్ష గాజుల పూజ
తాళ్లపూడి: స్థానిక నవదుర్గాది పరివార సహిత కననదుర్గమ్మ ఆలయంలో శ్రావణ పూర్ణిమ సందర్భంగా సోమవారం లక్ష గాజులతో పూజా మహోత్సవం నిర్వహించారు. అమ్మవారికి గాజులు అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు అల్లూరి శివప్రసాద్ ఆధ్వర్యంలో మహిళలు కుంకుమార్చన, లక్ష గాజుల పూజలో పాల్గొన్నారు. అమ్మవారికి గాజులు అలంకరించారు.
Comments
Please login to add a commentAdd a comment