
అనుమానంతో భార్యను చంపేశాడు
● పురుషోత్తపట్నంలో దారుణం
● కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సీతానగరం/రాజానగరం: తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను కిరాతకంగా కత్తితో నరికి హత్య చేశాడు. సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో మంగళవారం ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. దేవీపట్నం మండలం దండంగికి చెందిన చాట్ల జాన్‌తో నేలకోటకు చెందిన దివ్యభారతి (30)కి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి రమ్మిత్రీ 8వ తరగతి, కుమారులైన చెర్రి, పోసి ఆరు, ఐదు తరగతులు చదువుతున్నారు. జాన్, దివ్యభారతితో పాటు వారి తల్లిదండ్రులు కూడా సొంతూళ్లను వదిలి సీతానగరం మండలం పురుషోత్తపట్నానికి వచ్చేశారు.
భార్యపై అనుమానం
తాగుడుకు బానిసైన జాన్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఆమెను వేధింపులకు గురిచేసేవాడు. జాన్ తాగుడుకు బానిస కావడంతో కుటుంబ బాధ్యతను దివ్యభారతి తీసుకుంది. పురుషోత్తపట్నంలో ఒక కూల్ డ్రింక్ షాపు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తోంది. భర్త వేధింపులను భరించలేక, అతడి తీరులో మార్పురాకపోవడంతో విడిపోవాలనే నిర్ణయానికి వచ్చి వేరుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనాలుగు రోజుల క్రితం వృద్ధురాలైన తన తల్లి సునీతకు ఆరోగ్యం బాగోక రాజమహేంద్రవరం ఆస్పత్రిలో ఉన్న ఆమెకు ఆసరాగా ఉండేందుకు వెళ్లింది. అక్కడి రెండు రోజుల క్రితమే ఇంటికి తిరిగొచ్చింది.
కత్తితో నరికి..
దివ్యభారతి మంగళవారం తెల్లవారుజామున 4.45 గంటలకు బహిర్భూమికి వెళ్లిన సమయంలో జాన్ కత్తితో దాడి చేశాడు. ఆమె ఎంత బతిమలాడినా వినకుండా విచక్షణారహితంగా నరికేశాడు. చేతులు, మెడ, నడుము తెగిపోవడంతో దివ్యభారతి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం జాన్ సిగరెట్టు కాల్చుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మృతురాలి తండ్రి సరిపల్లి చిట్టియ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ అడపా నాగమురళి తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐతో పాటు ఇన్‌చార్జి ఎస్సై ఆనంద్ కుమార్, సిబ్బంది పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment