
రత్నగిరి కిటకిట
తొండంగి: శ్రావణమాసంలో వివాహా ముహూర్తాల నేపథ్యంలో శుక్రవారం రత్నగిరి నూతన దంపతులతో కిటకిటలాడింది. గురువారం రాత్రి వివాహాలు జరగడంతో రాష్ట్రం నలుమూలల నుంచి నూతన దంపతులు సత్యదేవుని వ్రతాలు ఆచరించేందుకు అధిక సంఖ్యలో వచ్చారు. అదేవిధంగా రత్నగిరి, సత్యగిరి కొండలపై కూడా వివాహాలు జరిగాయి. ఈ నేపథ్యంలో వ్రతమంటపాలన్నీ నూతన వధూవరులతోపాటు భక్తులతో రద్దీగా మారాయి. సత్యదేవుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. దేవస్థానం అధికారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా మంచినీరు, మజ్జిగ వంటివి ఏర్పాటు చేశారు. కాగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పండగ సందర్భంగా రత్నగిరి కొండపై వనదుర్గ అమ్మవారి ఆలయంలోనూ, కొండ దిగువ దుర్గామాత ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రెండు వేల వ్రత మంటపాల్లో ఏసీలు పనిచేయక భక్తులకు ఇబ్బందులు
రత్నగిరి కొండపైకి సత్యదేవుని వ్రతమాచరించే భక్తులకు రెండు వేలు రూపాయల వ్రత మంటపాల్లో ఏసీలు రెండు రోజులుగా సక్రమంగా పనిచేయక భక్తులు ఇబ్బందులు పడ్డారు. కొండపైన రూ.1,500, రూ.వెయ్యి తదితర కేటగిరిల్లో మంటపాలు కేటాయించి భక్తులకు వ్రతాలు నిర్వహిస్తారు. భక్తుల సౌకర్యార్థం కొండపై స్వామి వారి ప్రధానాలయం ఎదురుగా ఏసీ మంటపాలను ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఏసీ పనిచేయకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయంగా విడిగా ఏసీలు ఏర్పాటు చేశారు. అవి రెండు రోజులుగా సక్రమంగా పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని భక్తులు వాపోయారు. దేవస్థానం అధికారులు వ్రత మంటపాల్లో పూర్తిస్ధాయిలో ఏసీ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వ్రతం నిర్వహించే సమయంలో కేవలం దంపతులకు మాత్రమే కూర్చునే అవకాశం ఇస్తున్నారని, కుటుంబ సమేతంగా దంపతులతోపాటు తమ సంతానాన్ని కూడా వ్రతంలో పాల్గొనేందుకు వ్రత మంటపాల్లో కూర్చునే వెసులుబాటు కల్పించాలని హైదరాబాద్‌కు చెందిన భక్తుడు విఠల్ కోరారు. పిల్లలకు కూడా పూజా విధానం, సత్యదేవుని వ్రత విధానం, ఆచార వ్యవహారాలపై అవగాహన, మరింత ఆసక్తి కలుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment