సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడి
● స్వామిని దర్శించిన 40 వేల మంది
● దేవస్థానం ఆదాయం రూ.40 లక్షలు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆదివారం వేలాదిగా వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. సత్యదేవుని సన్నిధిన శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. వివాహాలు చేసుకున్న నవ దంపతులు, ఇతర ప్రాంతాలలో వివాహాలు చేసుకున్నవారు పెద్ద సంఖ్యలో సత్యదేవుని ఆలయానికి తరలి వచ్చారు. వారంతా సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయంతో బాటు ఆలయ ప్రాంగణం, వ్రతాలాచరించే భక్తులతో వ్రత మంటపాలు, స్వామివారి దర్శనం అనంతరం సేద తీరే భక్తులతో విశ్రాంతి మంటపాలు కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా స్వామివారి వ్రతాలు మూడు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించారు.
కన్నుల పండువగా రథోత్సవం
సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతేదేవి అమ్మవారి రథోత్సవం ఆది వారం కన్నుల పండువగా జరిగింది. ఉదయం పది గంటలకు రధాన్ని తూర్పు రాజగోపురం ముందుకు తీసుకువచ్చారు. అనంతరం ఆ రధంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను ప్రతిష్టించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కోట సుబ్రహ్మణ్యం స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. అనంతరం దేవస్థానం ఏఈఓ కృష్ణారావు కొబ్బరికాయ కొట్టి రధోత్సవం ప్రారంభించారు. తరువాత ఆలయ ప్రాకారంలో రధానికి నాలుగు దిక్కుల కొబ్బరి కాయలు కొట్టి రధోత్సవాన్ని నిర్వహించారు. రూ.2,500 టిక్కెట్ తో ఇద్దరు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదపండితులు, అర్చకులు, వ్రతపురోహితులు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సత్యదేవుని రథోత్సవం
Comments
Please login to add a commentAdd a comment