కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అట్రాసిటీ కేసు పెడతానంటూ ఉన్నతాధికారులు, సహోద్యోగులను భయబ్రాంతులకు గురిచేస్తున్న ఓ ఉద్యోగికి రాజమహేంద్రవరం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీసూర్యప్రభ మంగళవారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. దారా గౌతమ్ రాంజీ అనే వ్యక్తి రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో జనరల్ డ్యూటీ అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అట్రాసిటీ కేసు పెడతానంటూ బెదిరిస్తున్నాడని కొద్దిరోజుల క్రితం అతడి వ్యవహారశైలిపై 38 మంది ఎంఎన్‌వోలు, జీడీఏలు విచారణాధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో సూపరింటెండెంట్ జోక్యం చేసుకుని సహోద్యోగులతో వ్యవహరించే తీరును మార్చుకొని రోగుల సంరక్షణ కోసం నిబద్ధతతో పనిచేయాలని, ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని రాంజీని మందలించారు. రాంజీ తీరులో మార్పు రాకపోగా ఫిర్యాదుదారులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా అట్రాసిటీ కేసు పేరుతో బెదిరింపులకు గురిచేస్తున్నాడనే ఫిర్యాదుతో సూపరింటెండెంట్ మంగళవారం రాంజీకి షోకాజ్ నోటీసు జారీ చేశారు.