
కన్నుల పండగగా పవిత్రోత్సవం
ఆత్రేయపురం: వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో రెండో రోజు గురువారం పవిత్రోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. వేదపండితులు, అర్చకులు వేద మంత్రాలతో ఆలయ ప్రాంగణం శోభిల్లింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు. స్వామి, దేవేరుల త్రయాహ్నిక దీక్షా పూర్వక పవిత్రోత్సవాలను పశ్చిమ గోదావరి జిల్లా నడిపూడి గ్రామానికి చెందిన వేదపండితులు ఖండవల్లి రాజేశ్వరవర ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామి వారికి దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ భూపతిరాజు కిషోర్‌కుమార్ పట్టు వస్త్రాలను అందజేశారు. పవిత్రోత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొనడంతో గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ ఈఓ ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నేటితో ముగియనున్న పవిత్రోత్సవాలు
ఉదయం 8 గంటలకు సంకల్పం, మహాశాంతి హోమం, ప్రాయశ్చిత్త హోమం, మహా పూర్ణహుతి, పవిత్ర విసర్జన, మహదాశీర్వచనం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈఓ తెలిపారు.
ఎల్‌బ్రోస్‌పై త్రివర్ణ పతాకం
కాకినాడ సిటీ: కాకినాడ జిల్లా ఫారెస్టు అధికారి ఎస్.భరణి యూరప్‌లోనే అతి ఎత్తైన పర్వతం ఎల్‌బ్రోస్ 5,642 మీటర్లు (18,505 అడుగులు) ఎక్కి త్రివర్ణ పతాకాన్ని గురువారం ఉదయం 12.30 గంటలకు ఎగురవేశారు. ఈమె కాకినాడ జిల్లా అధికారి కావడం జిల్లాకు గర్వకారణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతటి ఘనత సాధించిన డీఎఫ్‌ఓ భరణిని జిల్లా అధికారులు అభినందించారు.

కన్నుల పండగగా పవిత్రోత్సవం
Comments
Please login to add a commentAdd a comment