
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం రూరల్: సీబీఎస్‌ఈ సిలబస్ అనుబంధ పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లాలోని సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టళ్ల నిర్వహణ, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సీబీఎస్‌సీ సిలబస్ అనుబంధ పాఠశాలల్లోని వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలోని 55 బీసీ, ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్లలో ఎంతమంది పిల్లలు ఉన్నారని, వారికి అందిస్తున్న భోజనం, కాస్మోటిక్ చార్జీలు, మెడికల్ క్యాంపుల నిర్వహణ తదితర అంశాలపై అధికారులను ఆరా తీశారు. సోషల్ వెల్ఫేర్ జేడీ జ్యోతిలక్ష్మీదేవి, డీఈఓ ఎం.కమలకుమారి తదితరులు పాల్గొన్నారు.
పూర్తిగా మంచానికి, వీల్ చైర్‌కు పరిమితమైనట్లు వికలాంగ సర్టిఫికెట్లు పొంది అధిక మొత్తంలో పెన్షన్లు పొందుతున్న పింఛనుదారులను పునః పరిశీలించాలని కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశించారు. జిల్లాలో దివ్యాంగులకు అందిస్తున్న పింఛన్లపై ఆయన సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పూర్తి అంగవైకల్యం కలిగి మంచానికి, కుర్చీలకే పరిమితమైనట్లు సదరం సర్టిఫికెట్లు పొంది, లేక ఎటువంటి సర్టిఫికెట్ లేకుండా రూ.15 వేల పింఛన్ అందుకుంటున్న వ్యక్తులు 668 మంది ఉన్నారన్నారు. ఇందులో కొంతమంది అతి తక్కువ అంగవైకల్యం కలిగి ఉన్నప్పటికీ పూర్తి అంగవైకల్యం కేటగిరీలో రూ.15 వేల పింఛన్లు పొందుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీనిపై జిల్లాలో 5 రీఅసెస్మెంట్ మెడికల్ టీమ్‌లను ఏర్పాటు చేసి పునః పరిశీలించాలన్నారు. ఈ టీమ్‌లో ఆర్థోపెడీషియన్, ఫిజీషియన్, మెడికల్ ఆఫీసర్ ఉంటారన్నారు. ఈ ప్రక్రియ నెలాఖరు లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్‌ఓ దుర్గారావు దొర, డీఆర్డీఏ పీడీ శివశంకర ప్రసాద్, డీసీహెచ్ ఎస్.కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment