
ప్రపంచానికి మూలవాసులు ఆదివాసీలు
సాక్షి, అమలాపురం: నాగరికత పరిఢవిల్లుతున్న ప్రపంచ సమాజాలన్నింటికీ మూలవాసులు ఆదివాసీలని కలెక్టర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఆదివాసీల ఆశయాలను గిరిజనులు స్ఫూర్తిగా తీసుకుని గిరిజనాభివృద్ధికి తోడ్పడాలని ఆయన సూచించారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వంగా ఉన్నాయని, ప్రపంచీకరణ, నాగరికత ముసుగులో ఆదివాసీలు ఉనికి కోల్పోతున్నారని వాటిని కాపాడుకోవడానికి మూలవాసీలు నిరంతరం పోరాడుతూనే ఉన్నారన్నారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు హక్కుల పరిరక్షణకై జరిగిన చర్చల ఫలితంగా ఐక్యరాజ్యసమితి ఆగస్టు 9 ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించిందన్నారు. నైపుణ్యాభివృద్ధి మిషన్ ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించుకుని వలసలు నివారించుకోవాలని సూచించారు. ఆదివాసీ సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన అంశాలైన నకిలీ గిరిజన ధ్రువపత్రాల నిర్మూలన, పందుల పెంపకానికి స్థలాల కేటాయింపు, కమ్యూనిటీ హాలు, కళ్యాణ మండపం నిర్మించాలని అధికారులను కోరారు. ఎస్టీ స్టడీ సర్కిల్, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన తదితర సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయనున్నట్టు తెలిపారు. ఆదివాసీ సంఘాల పెద్దలను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, ఆర్టీవో జి.కేశవవర్థనరెడ్డి, ఉప్పు శ్రీనివాస్, మానుపాటి గోవిందరావు, బండారు సత్యనారాయణ, బండారు గోవింద్, వికాస జిల్లా మేనేజర్, జి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ మహేష్‌కుమార్
● ఘనంగా
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం