
కూలీలకు బకాయి వేతనాలు జమ
ఆలమూరు: జిల్లాలోని 22 మండలాలకు చెందిన ఉపాధి కూలీలకు బకాయి వేతనాలు జమ అవుతున్నాయి. మొత్తం 5.11 లక్షల ఉపాధి కూలీలకు గత నాలుగు నెలల నుంచి రూ.75.21 కోట్ల వేతనాలను ప్రభుత్వం అందించాలి. దీనిపై ఈ నెల 4న ‘సాక్షి’ దినపత్రికలో ఆ‘కూలీ’ కేకలు అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ నెల పది వరకూ బకాయి పడిన వేతనాలను ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఈ విషయాన్ని ఎన్‌ఆర్‌ఈజీఎస్ పీడీ పి.మధుసూదన్, ఆలమూరు ఏపీఓ జి.అరుణకుమారి తెలిపారు. ఉపాధి కూలీలకు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే సంబంధిత ఏపీఓ కార్యాలయాలను సంప్రదించాలన్నారు.
నేటి నుంచి స్కూల్
కాంప్లెక్స్ సమావేశాలు
రాయవరం: రెండు రోజుల పాటు జరిగే పాఠశాల స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు శనివారం ప్రారంభం కానున్నాయి. 2024–25 విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులకు పాఠశాల సముదాయ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుగుణంగా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సమావేశాల నిర్వహణకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని 22 మండలాల్లో 47 ప్రాథమిక స్థాయి కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ కాంప్లెక్స్‌ల పరిధిలోని 50 శాతం ఉపాధ్యాయులు శనివారం జరిగే కాంప్లెక్స్ సమావేశాలకు హాజరు కానుండగా, మిగిలిన 50 శాతం మందికి నిర్దేశించిన కాంప్లెక్స్‌లో సోమవారం హాజరు కానున్నారు. అలాగే తెలుగు, గణితం, బయలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు శనివారం సబ్జెక్ట్ కాంప్లెక్స్ సమావేశాలు జరగనుండగా, సోమవారం ఇంగ్లిషు, ఫిజికల్ సైన్స్, హిందీ, సోషల్ సబ్జెక్టు ఉపాధ్యాయులకు సబ్జెక్టు సమావేశాలు నిర్వహించనున్నారు. ఉన్నత పాఠశాలల్లో పనిచేసే వ్యాయామ ఉపాధ్యాయులకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమావేశాలను శనివారం నియోజకవర్గ స్థాయిలో జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లాలో 123 స్కూల్ కాంప్లెక్స్‌లు ఉండగా, వాటి పరిధిలో 5,442 ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు హాజరు కానున్నారు. అలాగే 5,200 మంది వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలకు సంబంధించిన ఉర్దూ టీచర్లకు ఈ నెల 20న రాజమహేంద్రవరంలోని మకా ఉర్దూ మీడియం ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ ): ఏపీ ఈఏపీ సెట్–24 మూడవ దశ కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. గత జూన్ 30వ తేదిన మొదటి దశ ,జూలై నెలలలో రెండవ దశకు నోటిఫికేషన్ విడుదలచేసి సీట్లు భర్తీ చేయగా తాజాగా మూడవ దశకు షెడ్యూల్ విడుదల చేశారు.
● ఆగస్టు 19వ తేది నుంచి 21వ తేది వరకూ అన్‌లైన్ అన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు
● ఆగస్టు 22 వ తేది వరకూ అన్‌లైన్ సర్టిఫికెట్ల పరిశీలన
● ఆగస్టు 20 నుంచి 22 వరకూ వెబ్ అప్షన్లు. 23వ తేదీన వెబ్ అప్షన్లు మార్పునకు అవకాశం.
● ఆగస్టు 26న సీట్ల కేటాయింపు. 26వ తేదీ నుంచి 30వరకూ కళాశాలలో చేరికకు చివరితేది.
● ఉమ్మడి జిల్లాలో హెల్ప్‌లైన్ కేంద్రం ఆంధ్రాపాలిటెక్నిక్ కళాశాల (జగన్నాథపురం)
కోల్‌కతా ఘటనపై
నేడు ఐఎంఏ నిరసన
అమలాపురం టౌన్: కోల్‌కతాలో ఓ జూనియర్ మహిళా డాక్టర్‌పై ఆటవికంగా అత్యాచారం చేసి, ఆ తర్వాత అతి కిరాతకంగా హతమార్చిన ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. డాక్టర్లపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలపై జిల్లా ఐఎంఏ ఆధ్యర్యంలో అమలాపురంలో శనివారం ఉదయం నిరసన చేపట్టేందుకు నిర్ణయించినట్టు సంఘ జిల్లా కార్యదర్శి డాక్టర్ కడలి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం కోనసీమలోని వైద్యులంతా అమలాపురం గడియారం స్తంభం సెంటరుకు చేరుకుని, అక్కడ నిరసన వ్యక్తం చేస్తారని చెప్పారు. అక్కడ నుంచి వైద్యులు ప్రదర్శనగా స్థానిక కలెక్టరేట్‌కు చేరుకుని, కలెక్టర్‌కు వినతిపత్రం అందించనున్నట్టు వివరించారు. శనివారం ఉదయం 9 గంటల కల్లా ఐఎంఏ వైద్యులంతా గడియారం స్తంభం సెంటరుకు చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment