
● మేళతాళ మంగళ వాయిద్యాలతో
గ్రామోత్సవం
● విద్యుత్ దీపాలంకరణ,
బాణసంచా కాల్పులు
● వాడపల్లి వెంకన్న ఆలయానికి
పోటెత్తిన భక్తులు
ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వేకువ జామునే స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, పుణ్యహవచనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని పుష్పాలతో అలంకరించారు. స్వామి వారి కల్యాణోత్సవాలు వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం వేదపండితులు శ్రీమాన్ ఖండవల్లి వర ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణ నడుమ కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు స్వస్తి వచనం, కల్యాణోత్సవ ప్రధాన హోమాలు, దిగ్దేవతా బలిహరణ, విశేషార్చన, నీరాజన మంత్రపుష్పాలు, సాయంత్రం 6 గంటలకు సంకల్పం, ప్రధాన హోమాలు నిర్వహించారు. కేరళ వాయిద్యాలతో స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం గౌతమీ గోదావరి నదిలో విద్యుత్ దీపాలంకరణతో సుందరీకరించిన హంస వాహనంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించారు. బాణసంచాకాల్పులు, భక్తజనం గోవింద నామస్మరణ నడుమ స్వామివారు ఉభయ దేవేరులతో గౌతమీ గోదావరిలో విహరించడాన్ని భక్తజనం తన్మయత్వంతో వీక్షించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను రంజిపజేశాయి. ఈ కార్యక్రమాలను దేవదాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ భూపతిరాజు కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం గౌతమీ గోదావరినదిలో స్వామివారి చక్రస్నాన మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో వివరించారు.
గౌతమీ గోదావరిలో
సాగిన స్వామివారి
తెప్పోత్సవం

ప్రత్యేక అలంకరణలో వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి