ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
కపిలేశ్వరపురం (మండపేట): జిల్లాలోని సామాన్య ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ కృషి చేస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి మండపేట నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వైఎస్సార్ సీపీ రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమితులైన నేపథ్యంలో ఆయనను పార్టీ కార్యాలయంలో కలిశారు. వైఎస్సార్ సీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా అందరం కలిసి పని చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట అన్నారు. అనంతరం ఇద్దరు నేతలూ విలేకర్లతో మాట్లాడారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినప్పటికీ 2 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసి, ప్రభుత్వం చేతులు దులుపుకోవాలనుకుంటోందని, ఈ విషయం అధికారుల మాటలను బట్టి అర్థమవుతోందని అన్నారు. గిట్టుబాటు ధర రూ.1,700 ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల 75 కేజీల బస్తాను కేవలం రూ.1,400కే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ, దుర్మార్గమైన పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై పోరాడేందుకు సదా సిద్ధంగా ఉంటామని అన్నారు. ‘మీ ధాన్యాన్ని మీరే అమ్ముకోవాలి’ అంటూ రైతులకు సలహాలివ్వడం వెనుక దళారులు కొమ్ము కాయడమనే కూటమి ప్రభుత్వ వ్యూహం బహిర్గతమవుతోందని చెప్పారు. కేశవరంలో ధాన్యం కొనుగోలు తీరును నిరసిస్తూ పార్టీలకు అతీతంగా ఆందోళన చేయడం కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక తీరుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, జెడ్పీటీసీ సభ్యుడు పుట్టపూడి అబ్బు, ఎంపీపీలు ఉండమట్ల వాసు, నౌడు వెంకట రమణ, పార్టీ సీనియర్ నాయకులు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, రెడ్డి రాజుబాబు, కర్రి పాపారాయుడు, దూలం వెంకన్నబాబు, ముమ్మిడివరపు బాపిరాజు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ తోట,
నియోజకవర్గ నాయకులతో భేటీ


