హైదరాబాద్ : కోడి కొండెక్కింది. రికార్డు స్థాయిలో చికెన్ ధర పలుకుతోంది. మండు టెండలో సాధారణంగా తగ్గే చికెన్ ధర ఈసారి ఏకంగా కేజీ రూ.310 చేరింది. గణనీయంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో కోళ్లు చనిపోవడం.., డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం, దాణా ధరలు పెరగడంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. దీనికి తోడు గత రెండు రోజులుగా మృగశిర కార్తె నేపథ్యంలో చికెన్‌కు గిరాకీ పెరగడం కూడా రేట్ల పైకి ఎగబాకడానికి కారణంగా కనిపిస్తోంది.
వేసవి కావడంతో ఫంక్షన్లు, వివాహాలు పెరిగిపోవడంతో చికెన్ వినియోగం అనూహ్యంగా పెరిగింది. శుక్రవారం రిటైల్ మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ ధర కిలో రూ.310 పలుకగా..కాలనీలు, బస్తీల్లో ఈ రేట్లు మరింత మండిపోతున్నాయి. ఇక స్కిన్‌తో ఉన్న చికెన్ కూడా రూ.260–280 వరకు అమ్ముతున్నారు. గత వారం రోజుల్లో కిలో చికెన్ ధర రూ.50 నుంచి 60 వరకు పెరిగింది.
లైవ్ బర్డ్ కిలో రూ.188 వరకు విక్రయించారు. సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సగటున రోజుకు 5 లక్షల నుంచి 7 లక్షల కేజీల చికెన్ విక్రయిస్తుండగా.. గత ఆదివారం ఏకంగా 50 లక్షల కేజీల చికెన్ అమ్మకాలు జరిగినట్లు స్టార్ బ్రాయిలర్ అండ్ లేయర్ హోల్‌సేల్ డీలర్స్ అసోసియేషన్ కార్యదర్శి మహ్మద్ ఆప్రోజ్ ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment