
కీలకమైన ప్రశ్నలున్నా ‘క్వశ్చన్ అవర్’ రద్దు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ‘క్వశ్చన్ అవర్’లో సభ్యులు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ప్రభుత్వం పారిపోతోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కీలకమైన అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ‘క్వశ్చన్ అవర్’ను రద్దు చేసిందన్నారు. సభ్యులకు తెలియకుండా ప్రశ్నల్లోనూ మార్పులు జరుగుతున్నా యని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాసనసభ లాబీల్లో హరీశ్‌రావు మంగళవారం మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు.
హెచ్‌ఎండీఏ భూములు తాకట్టు పెట్టడంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ), జల మండలి (హెచ్‌ఎండబ్ల్యూఎస్) నుంచి అప్పులు తెచ్చిన విషయంపై ప్రశ్నలు ఉండటంతో ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందనే ప్రశ్నోత్తరాలను రద్దు చేశారన్నారు. మొత్తం రూ.50 వేల కోట్లు అప్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. యాసంగి పంటలు ఎండిపోవడంపై కేటీఆర్‌కు సంబంధించిన ప్రశ్న కూడా ప్రశ్నావళిలో ఉందని, ఈ అంశంపై స్పీకర్‌కు సోమవారం తాను ఫోన్ చేసి క్వశ్చన్ అవర్ రద్దుపై ప్రశ్నించానని తెలిపారు.
ఆంధ్రా జలదోపిడీతో ఎండుతున్న పంటలు
ఆంధ్రా జలదోపిడీ కారణంగా మహబూబ్‌నగర్, నల్లగొండలో పంటలు ఎండిపోతున్నాయని హరీశ్‌రావు విమర్శించారు. వానాకాలం వ్యవసాయ సీజన్‌లో రైతులకు రైతు భరోసా ఇచ్చారా లేదా అనే ప్రశ్న వేస్తే ఏకంగా ప్రశ్నోత్తరాలే రద్దయ్యాయన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడం వల్ల తక్కువ ధరకు రైతులు పంటలు అమ్ముకొని నష్టపోయారని చెప్పారు. రాష్ట్రంలో 50 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో 42,363 మంది రైతులకుగాను 22,949 మందికి మాత్రమే రుణమాఫీ అయ్యిందని హరీశ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment