రోడ్డెక్కని సిటీ బస్సు | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కని సిటీ బస్సు

Published Sun, Aug 6 2023 6:38 AM | Last Updated on Sun, Aug 6 2023 7:15 AM

- - Sakshi

హైదరాబాద్: సిటీ బస్సు స్తంభించింది. ఆర్టీసీ కార్మికులు చలో రాజ్‌భవన్‌ ప్రదర్శనకు తరలివెళ్లడంతో శనివారం ఉదయం నుంచే బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయాన్నే విధులకు హాజరు కావాల్సి ఉద్యోగులు, స్కూళ్లు, కళాశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ తదితర ప్రధాన రైల్వేస్టేషన్లకు వెళ్లాల్సిన ప్రయాణికులు, రైళ్లు దిగి ఇళ్లకు వెళ్లాల్సిన వారు సైతం బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించాల్సి వచ్చింది. ఉదయం 10 గంటల తర్వాత సర్వీసులను పునరుద్ధరించినట్లు అధికారులు చెప్పినప్పటికీ మధ్యాహ్నం వరకు బస్సులు రోడ్డెక్కలేదు. రెండో షిఫ్ట్‌లో మాత్రమే వివిధ డిపోలకు చెందిన బస్సులు రోడ్లపై కనిపించాయి.

ఎలాంటి ముందస్తు ప్రణాళికలకు అవకాశం లేకుండా ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఆకస్మికంగా చేపట్టిన చలో రాజ్‌భవన్‌ కారణంగా తెల్లవారు జామున విధులకు హాజరు కావాల్సిన కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు తదితర సిబ్బంది విధులను బహిష్కరించి ప్రదర్శనకు తరలివెళ్లారు. దీంతో డిపోల్లోంచి బస్సులు బయటకు తీసేవాళ్లు లేకుండాపోయారు. సుమారు మూడువేల మందికి పైగా కార్మికులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నట్లు అంచనా.

విద్యార్థుల ఇక్కట్లు..
నగర శివార్లలోని ఇంజినీరింగ్‌ తదితర వృత్తివిద్యా కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఘట్కేసర్‌, హయత్‌నగర్‌, కీసర, ఇబ్రహీంపట్నం, బాచుపల్లి, మేడ్చల్‌, గండిమైసమ్మ, మొయినాబాద్‌ తదితర ప్రాంతాల్లోని కాలేజీలకు ప్రతిరోజు లక్షలాది మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తారు. ఉదయం, సాయంత్రం నగరశివార్లకు రాకపోకలు సాగించే సిటీ బస్సులు విద్యార్థులతో కిక్కిరిసిపోతాయి. కానీ శనివారం ఉదయమే ఎక్కడి బస్సులు అక్కడ ఆగిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సెవెన్‌ సీటర్‌ ఆటోలు, ప్రైవేట్‌ వాహనాలు, బైక్‌లపై ఆధారపడాల్సి వచ్చింది.

► నగరంలో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాల్సిన విద్యార్థులు కూడా సకాలంలో వెళ్లలేకపోయారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 3.5 లక్షల మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. రూట్‌పాస్‌లు, సాధారణ నెలవారీపాస్‌లపై రాకపోకలు సాగిస్తారు. ఉదయాన్నే ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు వెళ్లాల్సినవారు కూడా ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల నుంచి ఉదయం పూట దూరప్రాంతాలకు బయలుదేరాల్సిన బస్సులు కూడా ఆగిపోవడంతో మహాత్మా గాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్లలో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది.

ఠారెత్తించిన ఆటోవాలాలు..
గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 28 డిపోల్లో వందలాది బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు అనివార్యంగా ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో ఆటోవాలాలు అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు. సాధారణంగానే ఆటోడ్రైవర్లు ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తారు. శనివారం బస్సులు ఆగిపోవడంతో మరింత దారుణంగా వసూళ్లకు దిగారు. బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రులు తదితర ప్రాంతాలకు వెళ్లేవారు పెద్ద మొత్తంలో సమర్పించుకోవాల్సివచ్చింది. ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉండే సమయంలోనే బస్సులు అందుబాటులో లేకపోవడంతో రెట్టింపు వసూళ్లకు పాల్పడ్డారు. ఇక నగర శివార్లలో తిరిగే సెవెన్‌ సీటరుల, షేరింగ్‌ ఆటోలు కూడా సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ చార్జీలు తీసుకున్నట్లు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement