హైదరాబాద్: ఆర్టీసీ డీజిల్ బస్సులు ఇక తుక్కు జాబితాలో చేరనున్నాయి. ఏళ్ల తరబడి లక్షల కొద్దీ కిలోమీటర్లు తిరిగిన కాలం చెల్లిన బస్సులను వదిలించుకొనేందుకు ఆర్టీసీ సన్నద్ధమైంది. వీటి స్థానంలో అధునాతన ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ నుంచి విజయవాడతో పాటు పలు జిల్లా కేంద్రాలకు ఈ– గరుడ పేరుతో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జూన్ నుంచి దశలవారీగా ఈ ఏడాది చివరి నాటికి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను నగరంలో ప్రవేశపెట్టనున్నారు.
ప్రస్తుతం ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లోని 28 డిపోల్లో సుమారు 2500 బస్సులు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచి క్రమంగా డీజిల్ బస్సుల వినియోగాన్ని తగ్గించనున్నట్లు అధికారులు తెలిపారు. ‘ఈ సంవత్సరం వెయ్యి డీజిల్ బస్సులను తొలగించడంతో పాటు వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తాం. ఇలా ప్రతి సంవత్సరం డీజిల్ బస్సుల స్థానంలో పర్యావరణహితమైన బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం’ ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
ఐటీ కారిడార్‌లకు పరుగులు..
నగరంలో మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత సిటీ బస్సుల వినియోగం గణనీయంగా తగ్గింది. అదే సమయంలో నగర శివార్లలో బస్సుల అవసరం బాగా పెరిగింది. ఔటర్‌ను దాటి సిటీ విస్తరించింది. ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్, తదితర రంగాలకు చెందిన ప్రజలు కూడా శివార్లకు తరలివెళ్తున్నారు. చాలామంది నగరంలోని ఐటీ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ శివార్లలో నివాసం ఉండడంతో రవాణా సదుపాయం సవాల్‌గానే మారింది.
దీంతో జూన్ నుంచి ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ బస్సులను నగర శివార్ల నుంచి ఐటీ కారిడార్‌లకు నడపాలని అధికారులు భావిస్తున్నారు. తొలివిడత 28 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కంటోన్మెంట్ డిపో నుంచి వీటిని నిర్వహిస్తారు. ఈ బస్సులు సికింద్రాబాద్ నుంచి మణికొండ, ఇబ్రహీంపట్నం, దిల్‌సుఖ్‌నగర్‌లకు రాకపోకలు సాగిస్తాయి. జూలైలో మరో 32 బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ బస్సులు బాచుపల్లి నుంచి వేవ్‌రాక్. ప్రగతినగర్, బీహెచ్‌ఈఎల్, పటాన్‌చెరు తదితర ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌లకు నడపనున్నారు.
కోఠి– పటాన్‌చెరు డబుల్ డెక్కర్..
మరో రెండు నెలల్లో ప్రవేశపెట్టనున్న 10 డబుల్ డెక్కర్ బస్సులను కోఠి– పటాన్‌చెరుల మధ్య రెండు మార్గాల్లో నడిపేందుకు రూట్‌ను ఖరారు చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కోఠి– పటాన్‌చెరు (218), కోఠి– పటాన్‌చెరు (222) రూట్‌లలో ఈ బస్సులు నడుస్తాయి. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ బస్సులను నడిపేందుకు పెద్దగా ఆటంకాలు లేకపోవడంతో పాటు ఎక్కువ మంది ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు అవకాశం ఉండడంతో ప్రస్తుతానికి ఈ రెండు మార్గాలను ఎంపిక చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment