
ఉగాది తరువాత టాక్స్ రేట్లు పెరుగుతుండటమే కారణం
మరో వైపు వైరల్‌గా మారిన షష్ట గ్రహ కూటమి వార్తలు
భాగ్యనగరంలో భారీగా షాపింగ్ సందడి
హైదరాబాద్ నగరంలో పలు సాంస్కృతిక వేదికల్లో ఉగాది (Ugadi) ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు భాషా సాంస్కృతి శాఖ ఆధ్వరంలోనే కాకుండా పలు సాహిత్య, సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యంలో కళ, నృత్య ఉత్సవాలు, సాహిత్య వేడుకలు, ఉగాది పురస్కారాల సంబరాలను నిర్వహిస్తున్నారు. వారాంతాలతో పాటు సోమవారం రంజాన్ పండుగ కూడా కలిసి రావడంతో మూడు రోజుల సెలవులను ఆస్వాదించడానికి ఈ వేదికలను ఎంచుకుంటున్నారు.
సోషల్ మీడియాలో షష్ట గ్రహ కూటమి..
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో షష్ట గ్రహ కూటమి ((Shasta Graha Kutami) అనే అంశం వైరల్‌గా మారింది. అరుదుగా సంభవించే ఈ షష్ట గ్రహాల కూటమి వల్ల పలు మార్పులు సంభవిస్తాయని, ముఖ్యంగా రాశులపై ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్యులు, పండితులు వెల్లడిస్తున్నారు. 2019లో సంభవించిన ఈ షష్ట గ్రహ కూటమి అనంతరం కరోనా (Corona) మహమ్మారి విజృంభించిందని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. కానీ, విశ్వంలో నిత్యం ఏర్పడే మార్పుల్లో భాగంగానే ఈ ఆరు గ్రహాల కూటమి, అంతకు మించి ఎలాంటి ప్రభావాలూ ఉండబోవని నగరానికి చెందిన పరిశోధకులు సోషల్‌మీడియా (Social Media) వేదికగా పోస్టులు షేర్ చేస్తున్నారు.
ఉగాదికి కోరిక తీరింది..
వసంతానికి శుభారంబంగా అందరి జీవితాల్లోనూ వసంత శోభ వరించాలని ప్రకృతి దీవెనలతో నూతన సంవత్సరాది ప్రారంభమవుతోంది. అయితే ఈ ఏడాది అందరి చూపు నూతన వాహనాలపై పడింది. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా వాహనాలపై టాక్స్ పెరగనుందని నివేదికలు చెబుతున్న నేపథ్యంలో ఈ ఉగాదికి నగరవాసులు భారీ సంఖ్యలో కొత్త వాహనాలను బుకింగ్ చేసుకున్నారని ఆయా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.
చదవండి: హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ పతనం
తెలుగు సంవత్సరాది.. అందరికీ ఇష్టమైన ఉగాది..!
జీవితంలో అన్ని అనుభవాలను, అనుభూతులను సముపాళ్లలో ఆస్వాదించాలనే మంచి సందేశాన్నందిస్తూ నూతన తెలుగు ఏడాదికి ఆహ్వానం పలుకుతోంది. ఈ నేపథ్యంలో నగరమంతా కొంగొత్త ఆశలతో పండుగ శోభ వెల్లివిరుస్తోంది. సంక్రాంతికి ఆంధ్రా, దసరాకు తెలంగాణ (Telangana) ఊళ్లకు ప్రయాణమయ్యే నగరవాసులు.. ఉగాదికి మాత్రం నగరంలో ఉండటానికే ప్రధాన్యమిస్తున్నారు. ఈ సందర్భంగా నగరమంతా ఉగాది సంబరాల ఏర్పాట్లు, షాపింగ్ సందడితో కనిపిస్తోంది. మరోవైపు సాంస్కృతికప్రదర్శనలు, ఉగాది పురస్కారాలు, సాహిత్య కార్యక్రమాలు వంటి ఉత్సవాలకు సిద్ధమైంది.
– సాక్షి, సిటీబ్యూరో