సాక్షి, సిటీబ్యూరో: నగర వాసుల్లో విద్యుత్ వాహనాలపై అనేక అనుమానాలు, సందేహాలు నెలకొన్నాయి. గత కొంతకాలంగా విద్యుత్ వాహనాల వినియోగం విరివిగా పెరిగింది. దీనికితోడు ప్రభుత్వాల ప్రోత్సాహం కూడా ఓ కారణం అయితే, మెయింటెనెన్స్ కూడా మరో కారణంగా పలువురు వినియోగదారులు చెబుతున్నారు.
అయితే ధరల విషయంలో కాస్త ఎక్కువగా ఉన్నాయని, సామాన్యులకు అందుబాటులో లేవని పలువురి వాదనలు వినిపిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు దేశంలో అనేక కంపెనీలు ఈవీ వాహనాలను తయారు చేస్తున్నాయి. వీటిలో కొన్ని బ్రాండెడ్ కాగా మరికొన్ని హైబ్రిడ్ వెహికల్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే విద్యుత్ వాహనాల గురించి సమాచారం తెలుసుకునే వారికి పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.
కంపెనీల వారీగా వాహనాల ధర, ఒక సారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఎంత దూరం ప్రయాణించవచ్చు. మన్నిక, లేటెస్ట్ ఫీచర్స్, ఇతర అంశాలపై ఆన్‌లైన్‌లో శోధించడం పరిపాటిగా మారింది. స్నేహితులు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తీసుకుని, అన్నింటినీ సరిపోల్చుకున్నాకే నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే విద్యుత్తు మోటారు సైకిల్ వరకూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నా, కార్లు, ఆటో రిక్షాల విషయంలో వినియోగదారుల మన్ననలు పొందలేకపోతున్నాయి.
ఛార్జింగ్ స్టేషన్ల కొరత..
ప్రధానంగా విద్యుత్ వాహనాల కొనుగోలుకు వెనుకాడటానికి నగరంలో సరైన ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడమే అనే వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని రాయితీలు ఇచ్చినా నగర పరిధి దాటి బయటకు వెళ్లాలనుకుంటే మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాహనాలకు ఉన్న ఫిల్లింగ్ స్టేషన్లను విద్యుత్ ఛార్జింగ్ విషయంలో కనిపించడం లేదు. దీంతో లోకల్‌లో తిరగడానికి మాత్రమే విద్యుత్ వాహనాలు ఉపయోగపడతాయనే వాదన బలంగా వినిపిస్తోంది. నగరంలో విద్యుత్ వాహనాల అమ్మకాల సంఖ్య సైతం దీన్నే సూచిస్తోంది.
టూవీలర్ కొనుగోలుకు సై..
ఇప్పటి వరకూ సుమారు 1.20 లక్షల విద్యుత్ మోటారు సైకిళ్లు మార్కెట్లో అమ్మకాలు జరగగా, కార్లు, ఆటో రిక్షా, ఇతర వాహనాలన్నీ కలపి సుమారు 16 వేలు అమ్ముడయ్యాయి. సాధారణంగా మోటారు సైకిళ్లు 70 శాతం ఉంటే, ఇతర వాహనాలు 30 శాతం ఉంటాయి. విద్యుత్తు వాహనాల విషయంలో ఇతర వాహనాల సంఖ్య 15 శాతం కంటే తక్కువ ఉంది. భవిష్యత్తులో ప్రభుత్వం మరిన్ని ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తే ఈవీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లాంగ్‌డ్రైవ్ వెళ్లాలంటే ఇబ్బంది
హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లాలనుకుంటే బస్సు, ట్రైన్ నమ్ముకుంటే సమయానికి చేరుకోలేము. డ్యూటీ అయ్యాక రాత్రి బయలుదేరితే ఉదయం విశాఖ చేరుకునేట్లు ప్లాన్ చేసుకుంటాం. విద్యుత్ కారులో పోవాలంటే ఛార్జింగ్ సరిపోదు. ప్రతి 300 కిలో మీటర్లకు ఒక దఫా ఛార్జింగ్ చేయాల్సి వస్తుంది. ఒక వేళ ఎక్కడైనా ఛార్జింగ్ పెడదాం అంటే సుమారు 6 గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ లైఫ్ 8 ఏళ్లు అన్నారు. ఆ తరువాత కారు విలువలో సుమారు 40 శాతం బ్యాటరీ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే పెట్రోల్ కారు తీసుకున్నాను.
– వై.రాజేష్, కేపీహెచ్‌బీ
నెలకు రూ.3 వేల ఖర్చు తగ్గింది
రెండేళ్ల క్రితం ఈవీ మోటారు సైకిల్ కొన్నాను. ప్రతి 5 వేల కిలో మీటర్లకు సర్వీసింగ్ చేయించాలి. ఫుల్ ఛార్జింగ్ చేశాక ఎకానమీ మోడ్‌లో వెళితే 105 కిలో మీటర్లు వస్తుంది. స్పోర్ట్స్ మోడ్‌లో వెళితే 80 కిలో మీటర్లు వస్తుంది. పెట్రోల్ స్కూటీకి నెలకు రూ.3,500 పెట్రోల్ అయ్యేది. ఈవీ కొన్నాక నెల కరెంటు బిల్లు రూ.500 నుంచి రూ.700కి పెరిగింది. అదనంగా రూ.200 పెరిగినా పెట్రోల్ రూ.3,500 వరకూ తగ్గింది.
– గాదిరాజు రామకృష్ణంరాజు, హైటెక్ సిటీ
Comments
Please login to add a commentAdd a comment