హైదరాబాద్: కవాడిగూడ డివిజన్ పరిధిలోని దామోదర సంజీవయ్య బస్తీలో లక్ష్మి (55) అనే మహిళ ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోవడంతో ఇంటి దగ్గరే ఉన్న నాలాలో పడిందేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆదివారం రాత్రి నుంచి గాంధీనగర్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ, డిజాస్టర్ సిబ్బంది నాలాలో వెతికినా ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దామోదర సంజీవయ్యనగర్‌లో నివాసం ఉండే లక్ష్మి ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కాగా..భర్త గతంలోనే చనిపోయాడు.
దీంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వారి ఇంటి గోడ కూలిపోవడంతో ప్రమాదభరితంగా మారింది. హుస్సేన్‌సాగర్ నాలాకు రిటర్నింగ్ వాల్ పూర్తయితే తమ ఇంటికి టాయిలెట్ నిర్మించుకోవాలని అనుకున్నామని ఆమె కూతుళ్లు కన్నీటి పర్యంతరం అయ్యారు. మొహం కడుక్కోవడానికి ప్రయత్నించిన లక్ష్మి ప్రమాదవశాత్తు హుస్సేన్‌సాగర్ నాలాలో పడిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లక్ష్మి కూతురు సుజాత తన తల్లి దగ్గరికి రాగా..ఆమె కనిపించకపోవడంతో ఆందోళన చెంది పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో గాలించారు.
ఆచూకీ లభించకపోవడంతో గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకోని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ బృందాలు నాలాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. వందమంది సిబ్బంది నాలుగు బృందాలుగా నాలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ కోసం డ్రోన్లనూ వినియోగించారు. సోమవారం కవాడిగూడ నుంచి గోల్నాక వరకు దాదాపు 10 కి.మీ.ల మేర గాలింపు జరిపినట్లు ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో మంగళవారం కూడా గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment