
జీరో అవర్‌లో సభ్యుల ప్రశ్నలకు మంత్రి పొంగులేటి సమాధానం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై విచారణ జరిపించి స్వాదీనం చేసుకుంటామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కొంగరకలాన్‌లో సర్వే నెం.300లోని 95 ఎకరాల భూమిని గత ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిందని, దీని విలువ రూ.2 వేల కోట్లు ఉంటుందని కాంగ్రెస్ సభ్యుడు మల్‌రెడ్డి రంగారెడ్డి మంగళవారం శాసనసభ జీరో అవర్‌లో ఆరోపించగా, మంత్రి పొంగులేటి ఈ మేరకు బదులిచ్చారు. చెరువులను మట్టితో పూడ్చితే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు.
⇒ గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతాలకు అదనంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని పొంగులేటి తెలిపారు. తిరుమలగిరి మండలంలోని 18 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు.
⇒ ఆరోగ్యశ్రీ పథకం పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈనెల 17 నుంచి ఆస్పత్రులు నగదు రహిత చికిత్సలను నిలిపేశాయని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు తెలిపారు.
⇒ మధ్యాహ్న భోజనం పథకం కింద విద్యార్థులకు మళ్లీ గుడ్లనే ఇవ్వాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు.
⇒ ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు, నిరసనలపై నిషేధం విధిస్తూ ఇచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్న వారిని అరెస్టు చేయడం తగదన్నారు.
⇒ తనను శాసనసభ నుంచి వెలివేస్తానని సీఎం రేవంత్ పదేపదే అంటున్నారని, తన నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామంలోనైనా 100 శాతం రుణమాఫీ జరిగితే తానే రాజీనామా చేస్తానని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాలు విసిరారు.
⇒ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎండిపోయిన పంటలకు పరిహారం చెల్లింపుపై కూనంనేని సాంబశివరావు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment